లాకౌట్ దిశగా న్యూట్రిన్ ఫ్యాక్టరీ
చిత్తూరు (అర్బన్): ఆరు దశాబ్దాలకుపైగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న చిత్తూరు న్యూట్రిన్ ఫ్యాక్టరీ(ప్రస్తుత హర్షీస్) లాకౌట్ బాట పడుతోంది. ఫ్యాక్టరీలో ఏ క్షణంలో అయినా లాకౌట్ ప్రకటించవచ్చని యాజమాన్యం నుంచి సంకేతాలు రావడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
కార్మికుల ఆందోళన
ఫ్యాక్టరీ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ కార్మికులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడి దీన్నే నమ్ముకుని పనిచేస్తున్న తమ కడుపులు కొట్టి ఫ్యాక్టరీను మూసివేయడం మంచిది కాదని వాపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పీవీ గాయత్రీదేవి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్, చిత్తూరు యువజన కన్వీనర్ నారాయణ, బీసీ కన్వీనర్ జ్ఞాన జగదీష్ తదితరులు న్యూట్రిన్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులకు అండగా నిలిచారు. అలాగే వైఎస్ఆర్టీయూసీనాయకులు రమేష్, పూర్ణచంద్రారెడ్డి, గోవిందు, గంగాధరం, రమేష్, మురుగేష్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యాక్టరీలో వైఎస్ఆర్టీయూసీ సమక్షంలో రెండేళ్ల పాటు అగ్రిమెంట్ చేసుకున్న యాజమాన్యం ఉన్నపళంగా కార్మికులను రోడ్డున పడేయడం మంచిది కాదని గాయత్రీదేవి ధ్వజమెత్తారు. దీనికి తోడు ఫ్యాక్టరీలో ఉన్న వైఎస్సార్టీయూసీ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ యూనియన్లలో ఒక్కో యూనియన్ నుంచి ఏడుగురు చొప్పున చర్చలకు పిలిచిన ఉన్నతాధికారులు కార్మికులు స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే వారికి అందించాల్సిన ప్రోత్సాహకాలు అందుతాయని చెప్పినట్లు కార్మిక సంఘాలు తెలిపారు. మరో 15 రోజుల వరకు అవకాశం ఇస్తామని అప్పటిలోపు వీఆర్ఎస్ ఇవ్వాలని చెప్పినట్లు కార్మికులు పేర్కొన్నారు. అయితే ఈ నెల 2వ తేదీ నుంచే ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు సమాచారం అందిందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.
భారీ భద్రత
ఫ్యాక్టరీ మూత పడుతున్నట్లు వార్తలు రావడం, కార్మికులు ఫ్యాక్టరీ వద్దకు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టూటౌన్ సీఐ సూర్యమోహనరావు ఆదేశాలతో ఎస్ఐ లక్ష్మణ్‌రెడ్డి, ఇతర సిబ్బందితో కలిసి ఫ్యాక్టరీ వద్ద పెద్ద ఎత్తున భద్రత కల్పించారు. దాదాపు 50 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు.
ఆరు దశాబ్దాల సేవలు
1953లో న్యూట్రిన్ కన్ఫెక్షనరీ పేరిట చిత్తూరులో చాక్లెట్ల తయారీ ప్రారంభమైంది. దాని తరువాత 2006లో గోద్రెజ్ కంపెనీ దీన్ని కొనుగోలు చేసింది. 2008లో గోద్రెజ్, హర్షీస్ సంయుక్తంగా నడిపాయి. 2012 నుంచి ఫ్యాక్టరీ పూర్తిగా హర్షీస్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 300 మంది వరకు శాశ్వత కార్మికులు, 300 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. అయితే నెలకు 4 వేల టన్నుల ఉత్పత్తి ఉన్న చాక్లెట్లు ఒక్క సారిగా 400 టన్నులకు పడిపోవడంతో ఫ్యాక్టరీను లాకౌట్ చేయడానికి నిర్ణయించుకున్నట్లు యాజ మాన్యం ప్రకటించింది. దీంతో ఈ నెల 9న ఇక్కడ పనిచేస్తున్న అధికారులకు, కార్మికుల నుంచి సలహాలు కోరింది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో అదనపు భారం పడుతోందని, దీనిపై సలహాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసినట్లు యాజమాన్యం చెబుతోంది. ఉద్యోగుల నుంచి స్పందన రాకపోవడంతో ఈ నెల 18న మరో నోటీసును బోర్డులో ఉంచారు. అక్టోబరు నుంచి ఉత్పత్తి అనుమానమేనంటూ నోటీసులో స్పష్టం చేశారు. దీంతో ఒక్క సారిగా కార్మికుల్లో ఆందోళన నెలకొంది.