ఈ అమ్మాయి కిక్ బాక్సర్
వారికి సంక్షోభం కాదు, శాంతిని ఇవ్వండి... ఆయుధాన్ని కాదు, పుస్తకాన్ని ఇవ్వండి... అనర్థాన్ని కాదు, అవకాశాన్ని ఇవ్వండి అని అనాలనిపిస్తుంది ఎనిమిదేళ్ల తజముల్ ఇస్లామ్‌ని చూస్తే. కశ్మీర్‌లోని మారుమూల ప్రాంతం- బందీపోరకు చెందిన తజముల్ రెండు మూడు రోజుల క్రితమే ఇటలీ నుంచి స్వదేశం చేరుకుంది. సాధించిన ఘనత ఏమిటో తెలుసా? వరల్డ్ కిక్ బాక్సింగ్ అండర్-8 టైటిల్. ఈ రంగంలో అడుగు పెట్టిన మొదటి కశ్మీర్ అమ్మాయిగా మాత్రమే కాదు ఈ టైటిల్ గెలుచుకున్న భారతీయ చిన్నారిగా కూడా తజముల్ తన గొప్పతనాన్ని చాటుకుంది. ‘పోటీలో చైనా, అమెరికా, కెనడా దేశాలకు చెందిన అమ్మాయిలు వచ్చారు. నా పంచ్‌ల దెబ్బకు అంతే... మళ్లీ లేవలేదు’ అని నవ్వింది తజముల్.
మెరుపు కంటే వేగంగా కదులుతూ గాల్లో కాళ్లూ చేతులూ విసిరే తజముల్లో ఒక సహజసిద్ధమైన పోరాట పటిమ ఉన్నట్టు ఆమె కోచ్ ఫైజల్ అలీ అన్నాడు. సరైన ఆట మైదానం కూడా లేని స్కూల్లో చదివే తజముల్ను ఏవో కష్టాలు పడి, అతడు తర్ఫీదు ఇస్తున్నాడు. ‘తజముల్ తండ్రి టాక్సీడ్రైవర్. అతడు సంపాదించేది కుటుంబానికే సరిపోదు. తజముల్ ట్రైనింగ్‌కు స్పాన్సర్లు దొరకాల్సి ఉంది’ అన్నాడు ఫైజల్. సరైన శిక్షణ ఇవ్వాలే కానీ, ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించే శక్తి తజముల్లో ఉంది. ఈమెకు డబ్బు దొరకకపోయినా ఫరవా లేదు... కశ్మీర్లో ప్రశాంత వాతావరణం ఏర్పడితే చాలు. ఇలాంటి ప్రతిభావంతులు ఎందరో దేశానికి పేరు తేవడానికి సిద్ధంగా ఉన్నారు.