అధ్యక్ష భవనం ఎదుట కారు బాంబు పేలుడు
ఆడెన్: మరోసారి యెమెన్ బాంబు పేలుళ్లతో రక్తసిక్తమయ్యింది. గురువారం దక్షిణ యమనీ సిటీలోని అధ్యక్ష భవనం ముందు కారు బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో ఐదుగురు మృతిచెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. బాంబులతో ఉన్న కారును వేగంగా వచ్చి అధ్యక్ష భవనాన్ని ఢీ కొట్టిన దుండగుడు ఆత్మహుతికి పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అధ్యక్షున్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్టు సమాచారం.
ఇటీవలే అధ్యక్షుడు అబ్ద్-రబ్బుమాన్సోర్ హడీ సౌదీ అరేబియాలోని ఎక్సైల్ నుంచి ఆడెన్ చేరుకున్నారు. హౌతీ రెబల్స్, సంకీర్ణ దళాలు నగరాన్ని సమీపిస్తున్నారన్న సమాచారంతో గత ఏడాది అధ్యక్షుడు హడీ ఆడెన్ను విడిచి వెళ్లారు.