10న ఒంగోలుకు శివరామకృష్ణన్ కమిటీ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎట్టకేలకు శివరామకృష్ణన్ కమిటీ జిల్లాపై కరుణ చూపింది. అన్ని జిల్లాలు పర్యటించినా మొదటి నుంచి రాజధాని రేసులో ముందున్న ప్రకాశం జిల్లాకు రాజధాని ఎంపిక కోసం నియమించిన 10న శివ రామకృష్ణన్ కమిటీ రాకపోవడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కమిటీని కలిసి ప్రకాశం జిల్లాను సందర్శించాలని కోరారు. రాజధానికి కావాల్సిన అన్ని అనుకూలతలు ఈ జిల్లాకు ఉన్నాయని ఆయన సూచించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా పర్యటనకు కమిటీ రానుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఒంగోలు కలెక్టరేట్లో ఈ కమిటీ సమావేశం కానుంది. రాష్ట్ర విభజన జరగకముందు నుంచే ఒంగోలు రాజధానిగా విస్త్రత ప్రచారం జరిగింది. రాయలసీమకు, కోస్తాకు సమదూరంలో ఉండటంతో ఇక్కడ రాజధానికి అనుకూలంగా ఉంటుందని ప్రచారం సాగింది. మరోవైపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు దొనకొండ రాజధానికి అనుకూలం అంటూ నివేదిక పంపడంతో దొనకొండ వార్తల్లోకి వచ్చింది.
రాజధాని నిర్మాణానికి సరిపడా స్థలం అక్కడ అందుబాటులో ఉంది. సుమారు 54 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటం, గతంలో రక్షణ శాఖ విమానాశ్రయం కూడా దొనకొండలో ఉండటం, రైల్వే లైన్తో పాటు కృష్ణా నదీ జలాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎట్టకేలకు కమిటీ రాక అధికారికంగా నిర్ణయం కావడంతో అధికారులు కమిటీకి కావాల్సిన సమాచారం పొందుపరచడంలో నిమగ్నమయ్యారు.