ఆదిలాబాద్: జిల్లాలోని పలు రహదారులు చినుకుపడితే చిత్తడిగా మారుతున్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని స్థితికి చేరుతున్నాయి. వైద్యసేవలు అవసరమైనపుడు అంబులెన్స్‌లు గ్రామానికి రాక పేషెంట్లు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా నిండు గర్భిణులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం.. గురువారం జిల్లాలో రెండు చోట్ల జరిగిన ఈ ఘటనలే ఇందుకు నిదర్శనం..
బురదలో చిక్కుకున్న 108 అంబులెన్స్
నేరడిగొండ మండలంలోని శంకరాపూర్ గ్రామానికి చెందిన పూజకు గురువారం పురిటినొప్పులు వచ్చాయి. ఆమె కుటుంబీకులు 108కు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న 108 వాహనం పూజను ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో రోడ్డుపై బురదలో చిక్కుకుంది. గ్రామానికి చెందిన యువకులు బురదలోంచి అంబులెన్స్‌ను తోసి రోడ్డుపైకి చేర్చారు. వెంటనే నిర్మల్ ఆస్పత్రికి పూజను తరలించారు.
అర కిలోమీటర్ నడిచిన నిండు గర్భిణి
మండలంలోని అంకాపూర్ పంచాయతీ పరిధి చిన్న మారుతిగూడకు చెందిన ఆత్రం సావిత్రీబాయికి గురువారం పురుటి నొప్పులు వచ్చాయి. రోడ్డు సరిగా లేకపోవడంతో 108 వాహనం ఊరిలోకి రాని పరిస్థతి. పైగా ఓ వైపు వర్షం కురుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిండు గర్భిణిని ఆమె కుటుంబీకులు 500 మీటర్ల బురదరోడ్డు, పంట చేన్ల మీదుగా నడిపించుకుంటూ బీటీ రోడ్డుకు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన 108 అంబులెన్స్‌లో ఆమెను ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment