సాక్షి,ఆదిలాబాద్: జమిలి ఎన్నికలు వస్తే ఎలా..! శాసనసభ ఎన్నికలు ఈ ఏడాదిలోనే ఉంటాయని రాజకీయ పార్టీల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ పరిస్థితుల్లో లోకసభ ఎన్నికలు కూడా కలిసి రావచ్చనే సంకేతాలు వస్తుండటంతో నాయకుల్లో చర్చ షురూ అయింది. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. ఈ రెండు ఎన్నికలు కలిసి వస్తే పార్టీల సమీకరణాలు ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది.
వారిలో అనిశ్చితి..
బీఆర్‌ఎస్ నుంచి ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటించడం పూర్తయింది. ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న, బోథ్ నుంచి అనిల్‌జాదవ్, ఖానాపూర్ నుంచి భుక్యా జాన్సన్ నాయక్, ఆసిఫాబాద్ కోవ లక్ష్మిలను ఆపార్టీ ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖానాయక్, ఆత్రం సక్కులకు చుక్కెదురైంది. దీంతో తమ భవిష్యత్తు కోసం పార్టీ మార్పా, లేని పక్షంలో కలిసి నడవడమా అనే విషయంలో తర్జనభర్జనలో ఉన్నారు. ఈ క్రమంలో జమిలి ఎన్నికలు రావచ్చనే సాంకేతాలు రావడంతో వీరు నిర్ణయం తీసుకునే విషయంలో కొంత అనిశ్చితి కనబడుతుంది. ఇప్పటికిప్పుడే పార్టీ మారే విషయంలో కొంత వేచిచూసే దోరణి కనిపిస్తుంది.
సమీకరణలు ఎలా ఉంటాయో..
కాంగ్రెస్‌లో ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ పూర్తయింది. ఆదిలాబాద్ నుంచి ఎనిమిది మంది, బోథ్ నుంచి 18 మంది, ఖానాపూర్ నుంచి 15 మంది, ఆసిఫాబాద్ నుంచి 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన ప్రక్రియ మొదలు పెట్టగా ప్రస్తుతం జమిలి ఎన్నికల ప్రస్థావన రావడంతో పార్టీ సమీకరణలు ఎలా ఉంటాయనేది ఆసక్తి కలిగిస్తుంది. ప్రధానంగా లోక సభకు, శాసనసభకు పోటీ చేసే నాయకుల ఎంపికలో జమిలి ఎన్నికల పరంగా పార్టీ పరిశీలన ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరం.
ఇదిలా ఉంటే బీజేపీలో సోమవారం నుంచి నియోజకవర్గం వారీగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఈ నెల 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. తాజాగా జమిలి ప్రస్తావనతో ఆయన నిర్ణయంలో మార్పు ఉంటుందా.. లేని పక్షంలో లోకసభకే పోటీ చేయాలని ఆసక్తి కనబరుస్తారా అనేది దరఖాస్తు ప్రక్రియ ద్వారా స్పష్టమయ్యే అవకాశం ఉంది. మరో పక్క ఆయా నియోజకవర్గాల నుంచి పలువురు నేతలు బీజేపీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తుకు సిద్ధం అవుతున్నారు.
గత ఎన్నికల కంటే ముందు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 2014లో రాష్ట్రంలో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు ఒకే మారు జరిగాయి. అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గోడం నగేశ్, పెద్దపల్లి ఎంపీగా బాల్క సుమన్ గెలుపొందారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే అప్పట్లో ముథోల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విఠల్‌రెడ్డి, బీఎస్పీ పార్టీ పరంగా పోటీ చేసిన నిర్మల్ నుంచి ఐకేరెడ్డి, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి కోనప్ప మినహా మిగతా అన్ని స్థానాలు బీఆర్‌ఎస్ గెలుపొందింది. 2018లో కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో లోకసభ ఎన్నికల కంటే ముందే శాసన సభ ఎన్నికలు జరిగాయి.
ఆ ఎన్నికల్లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ పరంగా పోటీ చేసిన ఆత్రం సక్కు మినహా అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుపొందింది. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు గెలుపొందగా, పెద్దపల్లి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకటేశ్ నేతకాని గెలుపొందారు. తాజాగా జమిలి ఎన్నికల అంశం తెరపైకి వస్తుండటంతో మళ్లీ ఆయా పార్టీల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment