సాక్షి,ఆదిలాబాద్: బోథ్ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు ప్రయోజనమెంతా అనే చర్చ ప్రస్తుతం ఆ పార్టీలో సాగుతోంది. బీఆర్‌ఎస్, బీజేపీల ప్రచారం ముందు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం దిగదుడుపేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబట్టి మరీ టికెట్ తెచ్చుకున్న తర్వాత అభ్యర్థి తీరుపై పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్య నేతలు కలిసిరాకపోవడం, మండల శ్రేణుల్లో ఉత్సాహం కొరవడడంతో ఇక్కడ హస్తం గెలుపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రచారం నామమాత్రమే..
బోథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ రెండో జాబితాలో వన్నెల అశోక్‌ను మొదట ప్రకటించింది. దీంతో నియోజకవర్గంలో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆడె గజేందర్, నరేశ్ జాదవ్‌లు కలిసి కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అభ్యర్థిని మార్చాలనే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధిష్టానం అశోక్ అభ్యర్థిత్వాన్ని మార్చింది. ఆడె గజేందర్‌కు టికెట్ కేటాయిస్తూ మరో జాబితాలో పార్టీ స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో ఆయన కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ కూడా వేశారు. ఆ తర్వాత అశోక్ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో పాటు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తో సఖ్యత ఉన్న ఓ నేత ద్వారా పైరవీ చేసి మరీ టికెట్ మార్చడంలో ఆడె గజేందర్ సక్సెస్ అయ్యాడనే ప్రచారం జరిగింది. అందులో చూపెట్టిన ఉత్సాహం ప్రస్తుతం ప్రచారంలో కనిపించడం లేదని నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులే చర్చించుకోవడం గమనార్హం. ఈ క్రమంలో టికెట్ ఎందుకోసం తెచ్చుకున్నాడో అని వారు అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది.
కలిసిరాని నేతలు..
బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరంగా 18 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో ఆడె గజేందర్ మినహాయిస్తే వన్నెల అశోక్ బీఆర్‌ఎస్‌లో చేరారు. తొడసం ధనలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక అసమ్మతి వర్గంగా ఇద్దరు ఒక్కటై సమావేశం నిర్వహించిన ఆడె గజేందర్‌కు ప్రస్తుతం ప్రచారంలో నరేశ్ జాదవ్ కలిసిరాకపోవడం గమనార్హం. మిగతా దరఖాస్తుదారులు కూడా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ సభ జరిగినప్పుడు పాల్గొన్న కుమ్ర కోటేష్ ఆ తర్వాత ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం లేకపోలేదు.. గజేందర్ మిగతా నేతలను కలుపుకపోవడం లేదని పార్టీలో చర్చించుకుంటున్నారు. మండలాల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు ఆయన వెంట పార్టీ ముఖ్య నేతలు కనిపించడం లేదన్న అపవాదు కూడా వ్యక్తమవుతుంది.
రేవంత్ వివరణ ఇచ్చినప్పటికీ..
బోథ్ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు విషయంలో బోథ్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ శ్రేణుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీలను ఢీకొనే స్థాయిలో ప్రచారం చేయనప్పుడు గజేందర్ టికెట్ తెచ్చుకోవడం ద్వారా ఏం సాధించారన్న అభిప్రాయం వారిలోనే ఉత్పన్నమవుతుంది. రాష్ట్రంలో 12 స్థానాల్లో ఆదివాసీలకు 6, లంబాడాలకు 6 చొప్పున సీట్లు కేటాయించాలని పార్టీ నిర్ణయించిందని, అయితే ఇల్లందులో లంబాడా నేత, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ టికెట్ ఆశించగా, అక్కడ ఆదివాసీ నేత కోరం కనకయ్యకు కేటాయించినట్లు రేవంత్ చెప్పారు.
దీంతో సామాజిక సమీకరణాల్లో భాగంగా బోథ్‌లో మొదట అశోక్‌కు టికెట్ ప్రకటించినా మార్చాల్సి వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే గజేందర్‌కు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో ఓ చర్చ సాగుతోంది. మొదటి నుంచి సర్వేలో ముందున్న వారికి టికెట్ కేటాయిస్తామని చెప్పి ఇలా సమీకరణాల పేరుతో అభ్యర్థిని మార్చడం, ప్రస్తుతం బరిలో నిలిచిన గజేందర్ ప్రచారంలో దూకుడు చూపెట్టకపోవడంతో రేవంత్ వ్యాఖ్యలతో శ్రేణులు విభేదిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment