నిర్మల్ ఖిల్లా: ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమరం కొనసాగుతోంది. మరోవారం రోజుల్లో పోలింగ్ ఉండడంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం బరిలో నిలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఇష్టారీతిన డబ్బు ఖర్చు చేయడానికి వీలులేదు. ప్రస్తుత ఎన్నికల నిబంధనలు అనుసరించి వ్యయపరిమితి గరిష్టంగా రూ.40 లక్షలు మాత్రమే విధించబడినది. అయితే ఈ వ్యయ పరిమితి గతంలో ఉన్నదానికంటే క్రమంగా శ్రీఇంతింతై వటుడింతై...శ్రీఅన్న చందంగా పెరుగుతూ వస్తోంది. భారతదేశంలో స్వాతంత్య్రానంతరం 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో అప్పటి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ఖర్చు గరిష్టంగా రూ.లక్షగా నిర్దేశించబడింది. అప్పటి నుంచి ప్రతీసారి పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి గరిష్టంగా రూ.40 లక్షలు ఖర్చు చేయడానికి వ్యయపరిమితి విధించబడింది. అంటే ఎన్నికలు ప్రారంభమైన ఏడు దశాబ్దాల కాలంలో దాదాపు 40 రెట్లు పెరుగుతూ వచ్చింది.
నామినేషన్ వేసిన రోజు నుంచే లెక్క షురూ..
2014 అసెంబ్లీ ఎన్నికలకు రూ.28 లక్షలుగా ఉన్న అభ్యర్థుల వ్యయ పరిమితిని కేంద్ర ఎన్నికల కమిషన్ ఏకంగా రూ.40 లక్షలకు పెంచింది. లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిమితిని రూ.95 లక్షలుగా నిర్ణయించింది. నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ జరిగే వరకు అభ్యర్థి చేసే ఖర్చును ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తారు. పార్టీ చేసే ఖర్చు మాత్రం అభ్యర్థి వ్యయంలోకి రాదు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు చేసే ఖర్చులను బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలి. అందుకోసం నామినేషన్ దాఖలు చేసే నాటికే పోటీలో ఉన్న అభ్యర్థులంతా కొత్తగా బ్యాంకు అకౌంట్ ప్రారంభించుకున్నారు..
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు లేదా ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు ఎలాంటి ఖర్చు చేయరాదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన తాయిలాలను అభ్యర్థుల వ్యయంలో చేర్చాలని ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రోజువారీగా అభ్యర్థులు చేసే వ్యయంతో పాటు పార్టీ జెండాలు, బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లు, టోపీలు, కండువాలు, భోజనాలు, వాహనాల అద్దె, ఇంధన ఖర్చులు, సభా వేదికలు, మైకులు, పత్రికలు, టీవీ, సోషల్ మీడియా ప్రకటనలకు చేసే ఖర్చులను కలిపి అభ్యర్థి ఎన్నికల వ్యయంగా లెక్కిస్తారు. వీటిలో ప్రతి దానికీ బిల్లులు చూపించాల్సి ఉంటుంది. వీటన్నింటికి ఎన్నికల సంఘం ధరలు నిర్ణయిస్తుంది. వాటి ప్రకారమే లెక్కలు చూపించాల్సి ఉంటుంది. ఇవి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉన్నాయి.
పెరుగుతున్న వ్యయపరిమితి..
1952 సాధారణ ఎన్నికల్లో రూ.లక్షతో ప్రారంభమైన ఎన్నికల వ్యయ పరిమితి 1962 నాటికి రూ.3 లక్షలు 1971 ఎన్నికల నాటికి రూ.4 లక్షలు, 1975 నాటికి రూ.5 లక్షలు పెరుగుతూ వచ్చింది. 1984లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా రూ.10 లక్షలకు చేరువైంది. 1991 నాటికి మరో రెండు లక్షలు పెరిగి రూ.12 లక్షలకు చేరుకుంది. 1999లో రూ.15 లక్షలు, 2004 నాటికి రూ.17 లక్షలు, 2009లో రూ.26 లక్షలు, 2014లో రూ.28 లక్షల వ్యయపరిమితిని విధించారు. ప్రస్తుతం జరుగుతున్న 2023 ఎన్నికల్లో ఈ గరిష్ట వ్యయపరిమితి రూ.40 లక్షలకు చేరుకుంది.
వ్యయపరిమితి పెరుగుదల ఇలా..
సంవత్సరం వ్యయపరిమితి
(రూ.లక్షలలో)
1952 1
1962 3
1971 4
1975 5
1984 10
1991 12
1999 15
2004 17
2009 26
2014 28
2023 40
Comments
Please login to add a commentAdd a comment