ఇంద్రవెల్లి: నాగోబా జాతరలో భాగంగా మహాపూజకు అవసరమయ్యే గంగాజలం సేకరించిన మెస్రం వంశీయులు పాదయాత్రగా సోమవారం ఇంద్రవెల్లికి చేరుకున్నారు. ఇంద్రాదేవి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర గంగాజలాన్ని ఆలయం ఎదుట ఉన్న మర్రి చెట్టుపై భద్రపరిచారు. వీరి రాక నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి 22 కితల మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లతో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయం ప్రకారం నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి సమర్పించారు.
రాత్రి కేస్లాపూర్ సమీపంలోని మర్రి చెట్టు వద్దకు చేరి అక్కడే బస చేశారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రధాన్ కితకు చెందిన దాదారావ్ ఆధ్వర్యంలో నాగోబా చరిత్ర బోధిస్తారు. ఈ నెల 9న రాత్రి 10:30 గంటలకు మహాపూజ అనంతరం జాతర ప్రారంభించనున్నట్లు నాగోబా ఆలయ పీఠాధిపతి వెంవకట్‌రావ్ తెలిపారు. కార్యక్రమంలో మెస్రం వంశపెద్దలు కోసు కటోడా, కోసేరావ్, దాదారావ్, హనుమంత్‌రావ్, తిరుపతి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment