విద్యుత్ శాఖలో నిలిచిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియ
సంస్థ ఆదేశాలతోనే ఆగాయంటున్న అధికారులు
పండుగల నేపథ్యంలోనే అంటున్న వైనం
మరోవైపు ఉద్యోగుల్లో రకరకాల చర్చలు
సాక్షి, ఆదిలాబాద్: విద్యుత్ శాఖలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు బ్రేక్ పడింది. కొన్ని రోజులపాటు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొనసాగింది. ఇక ఉత్తర్వులు వెలువడడమే తరువాయి అనుకున్న దశలో ప్రక్రియను నిలిపివేశారు. కాగా నిలిపివేతకు సంబంధించి ఉద్యోగుల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. టీజీ ఎన్‌పీడీసీఎల్ యాజమాన్యం బదిలీలను హోల్డ్‌లో పెట్టాలని ఆదేశించడంతోనే నిలిపివేశారని కొందరు చెబుతుండగా, పండుగల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా తాత్కాలికంగా బదిలీలు ఆపారని మరికొందరు అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని సర్కిళ్లలో బదిలీల ప్రక్రియలో పెద్దఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో బదిలీ ఉత్తర్వులు నిలిపివేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
పైనుంచి ఆదేశాలు..
విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. షెడ్యూల్ మేరకు గత సోమవారం బదిలీ ఉత్తర్వులు విడుదల చేయాలి. టీజీఎన్‌పీడీసీఎల్‌లో సర్కిల్, డివిజన్, కంపెనీ ప్రధాన కార్యాలయాల్లో బదిలీలకు కసరత్తు కూడా పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయంలో బదిలీ జరిగిన ఉద్యోగుల వివరాలను సైతం నోటీసు బోర్డుపై ఉంచారు. బదిలీలను నిలిపివేయాలని పైనుంచి ఆదేశాలు రావడంతో అప్పటికప్పుడు నోటీసు బోర్డుపై నుంచి ఉత్తర్వులు తొలగించినట్లు తెలుస్తోంది.
చివరి క్షణంలో..
విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్‌మెన్, లైన్‌మెన్ పోస్టులకు సంబంధించి డివిజన్ స్థాయిలో.. సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్, ఫోర్‌మెన్, దాని పై పోస్టులకు సంబంధించి సర్కిల్ ఎస్‌ఈ స్థాయిలో.. ఏఈ, ఏడీ పోస్టులకు సంబంధించి కంపెనీ స్థాయిలో సాధారణ బదిలీల ప్రక్రియ కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. ప్రతీ క్యాడర్ సంఖ్యలో 50శాతం మందిని బదిలీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి 7వ తేదీన బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలని, 9న రిలీవ్ చేయాలని పేర్కొన్నారు. ఉద్యోగికి ఆప్షన్ ఫామ్ ఇచ్చి బదిలీ స్థానం ఎంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. సంస్థ సీఎండీ ఆదేశాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని పట్టణానికి.. పట్టణాల్లో పని చేస్తున్న వారిని గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేసే దిశగా అధికారులు కసరత్తు చేశారు. ఇదిలా ఉంటే బదిలీల ప్రక్రియలో యూనియన్‌ల ప్రమేయం లేకుండా చూడాలని ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సర్కిళ్లలో యూనియన్ నాయకుల ప్రమేయం కారణంగా బదిలీలు అసమంజసంగా జరిగాయని ఆరోపణలు వచ్చాయి. పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు సంస్థ దృష్టికి వెళ్లడంతో చివరి క్షణంలో బదిలీల ప్రక్రియ హోల్డ్‌లో పెట్టినట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.
పండుగల నేపథ్యంలో..?
ఉద్యోగుల బదిలీల నిలుపుదలకు సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాగా కొంతమంది అధికారులు, సిబ్బంది బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలోనే బదిలీల ప్రక్రియ నిలిపివేసినట్లు చర్చిస్తున్నారు. ఈ సమయంలో బదిలీ అయిన అధికారులు, ఉద్యోగులను రిలీవ్ చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావించి ఈ నెల 14 వరకు బదిలీలను హోల్డ్‌లో ఉంచారనే ప్రచారం సాగుతోంది. ఇలా భిన్న ప్రచారాల నేపథ్యంలో అసలు బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయా..? మళ్లీ ఏమైనా మార్పులుచేర్పులు ఉంటాయా..? అన్న ఉత్కంఠ సంస్థ ఉద్యోగుల్లో నెలకొంది.
ఉన్నతాధికారుల ఆదేశాలతో..
సంస్థ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బదిలీ ఉత్తర్వులను హోల్డ్‌లో పెట్టాం. దీనికి సంబంధించిన కారణాలు తెలియదు. సాధారణ బదిలీల్లో భాగంగా ప్రతీ క్యాడర్‌లో 50 శాతం మందిని ఆప్షన్ ఇచ్చి బదిలీలు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. సంస్థ తదుపరి నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తాం.
– జేఆర్ చౌహాన్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment