ఇటు వేతనం.. అటు పింఛన్!
● రూ.7.98 లక్షలు అక్రమంగా పొందిన వైనం ● ఆరుగురు సెర్ప్ సీసీల బాగోతం ● విచారణకు ఆదేశించిన సీఈవో
కై లాస్‌నగర్: జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పనిచేస్తున్న ఆరుగురు సీసీలు ఇటు ప్రభుత్వ వేతనం పొందడంతో పాటు అటు చే యూత కింద నిరుపేదలకు అందించే పింఛన్లు సైతం అందుకుంటున్నారు. విషయం ఏకంగా సెర్ప్ రాష్ట్ర సీఈవో దివ్య దేవరాజన్ దృష్టికి వెళ్లడంతో సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇప్పటి వరకు సదరు సీసీలు పింఛన్ల రూపంలో రూ.7లక్షల 98వేల 752లు అక్రమంగా పొందినట్లు తెలుస్తోంది. ఈమేరకు జిల్లా అధికారులు విచారణకు సిద్ధమవుతుండటంతో సంబంధిత సీసీల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.
రూ.24వేల నుంచి రూ.27వేల వరకు వేతనం..
మండల సమాఖ్యల పరిధిలోని స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం, తిరిగి వాటిని కట్టించడం, రికార్డులు నిర్వహిస్తూ, ఆడిట్ చేయించాల్సిన గురుతర బాధ్యత సెర్ప్ సీసీల (కమ్యూనిటీ కోఆర్డినేటర్ల)పై ఉంటుంది. ఇందులో పనిచేసే ఉద్యోగులందరికీ 1 ఏప్రిల్ 2023లో ప్రభుత్వం పే స్కేల్ ప్రకటించింది. సీనియారిటీ, క్యాడర్ వారీగా వేతనాలు నిర్ణయించింది. ఇందులో భాగంగా సీసీలను సైతం పర్మినెంట్ టెన్యూర్ ఎంప్లాయ్ (ఎఫ్‌టీఈ)గా పరిగణించిన ప్రభుత్వం వారికి రూ.24వేల నుంచి రూ.27వేల వరకు వేతనం అమలు చేస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి వేతనం పొందే ఉద్యోగులు, సిబ్బంది ఎవరూ కూడా సామాజిక భద్రత కింద నిరుపేదలకు అందించే పింఛన్ పొందేందుకు అవకాశం లేదు. ఒక వేళ అదనంగా ప్రభుత్వ ప్రయోజనాలు పొందితే దాన్ని అక్రమంగా భావించి వారిపై చర్యలు చేపట్టే అవకాశముంటుంది.
పింఛన్లు పొందుతున్నారిలా..
జైనథ్, ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ మండలాలకు చెందిన ఆరుగురు సీసీలు ప్రభుత్వ వేతనంతో పాటు చేయూత కింద పింఛన్ సైతం పొందుతున్నారు. ఇందులో జాదవ్ విజయ వితంతు పింఛన్ కింద రూ. 48,384లను తీసుకోగా, కాడమండ సావిత్రి వితంతు పింఛన్ కింద రూ. 1,80,992 పొందారు. అలాగే మంచికుంట్ల విజయలక్ష్మి రూ.1,74,992లు, షేక్ నహేదా రూ. 50,400, అడెపు లక్ష్మి రూ.1,68,992, ఎల్లుల పోసాని రూ.1,74,992లను బీడీ కార్మికులుగా పింఛన్ పొందుతున్నారు. ఈ ఆరుగురు కలిపి మొత్తం రూ.7,98,752 పింఛన్ రూపంలో ఇప్పటివరకు అందినట్లు తెలుస్తోంది.
విచారణకు సీఈవో ఆదేశం
సీసీల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ సమగ్ర విచారణకు ఆదేశించారు. మూడు రోజుల్లోగా నివేదిక అందించాల్సిందిగా డీఆర్డీవోను ఆదేశిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర స్థాయి అధికారి నుంచే నేరుగా ఉత్తర్వులు అందడంతో సదరు సీసీలతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. విధుల నుంచి సస్పెండ్ చేస్తారా.. లేక పింఛన్ రూపంలో పొందిన మొత్తాన్ని రీకవరీ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.
షోకాజు నోటీసులు జారీ చేశాం
సెర్ప్ సీఈవో ఆదేశాల మేరకు చేయూత పింఛన్ పొందుతున్న ఆరుగురు సీసీలకు షోకాజు నోటీసులు జారీ చేశాం. వారికి పేస్కేల్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది.. పింఛన్ ఎప్పటి నుంచి పొందుతున్నారనే వివరాలతో పాటు వారి నుంచి సంజాయిషీ కోరుతున్నాం. వారిచ్చే సమాధానాల ఆధారంగా శాఖాపరంగా
చర్యలుంటాయి. – జి.సాయన్న, డీఆర్డీవో
Comments
Please login to add a commentAdd a comment