వైద్యం అందితే బతికేదేమో..?
● యువతికి సకాలంలో అందని చికిత్స ● నిర్లక్ష్యం వహించిన పాఠశాల సిబ్బంది? ● ఆస్పత్రికి రాకముందే చనిపోయినట్లు వైద్యుల వెల్లడి ● చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు
బోథ్: ఫుడ్ పాయిజన్‌తో మృతి చెందిన ఫూల్ కాలి బైగాకు సకాలంలో సరైన వైద్యం అందలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మృత్యువాత పడినట్లు సమాచారం. మండలంలోని పొచ్చెర క్రాస్ రోడ్డు వద్ద గల సెయింట్ థామస్ పాఠశాలలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతి కాలి బైగా వంట మనిషిగా విధులు నిర్వహిస్తోంది. ఈ నెల 2న ప్రిన్సిపాల్ స్మిత జార్జ్, వైస్ ప్రిన్సిపాల్ దీపక్, ఉపాధ్యాయులు సోఫి, సిజితో కలిసి నిర్మల్‌లోని గ్రిల్9 రెస్టారెంట్‌లో భోజనం చేశారు. ఈ క్రమంలో అందరూ ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. అదేరోజు రాత్రి వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. వీరంతా 3వ తేదీన బోథ్ సీహెచ్‌సీలో చికిత్స పొందారు. వారికి వైద్యులు ఇంజక్షన్లతో పాటు మెడిసిన్ అందజేశారు. తరువాత పాఠశాలకు వెళ్లిపోయారు.
కాలి బైగాను ఆసుపత్రికి తీసుకెళ్లని సిబ్బంది..
మరుసటి రోజు కూడా వాంతులు, విరేచనాలు తగ్గకపోవడంతో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌తో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు 4వ తేదీన మళ్లీ బోథ్ సీహెచ్‌సీకి వెళ్లారు. కాలి బైగాను మాత్రం తీసుకెళ్లలేదు. నలుగురికి వైద్యులు చికిత్స అందించారు. అనంతరం మెడిసిన్ తీసుకుని వారు పాఠశాలకు చేరుకున్నారు. చికిత్స పొందని యువతి మాత్రం రాత్రంతా వాంతులు, విరేచనాలతో తీవ్రంగా బాధపడినట్లు తెలుస్తోంది. 5న ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను సిబ్బంది చూడగా అప్పటికే అపస్మారకస్థితికి చేరుకున్నట్లు సమాచారం. 8.50 గంటల ప్రాంతంలో బోథ్ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రిన్సిపాల్ మాత్రం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కాలి బైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పేర్కొనడం గమనార్హం.
ఆస్పత్రికి చేరుకున్న మృతురాలి కుటుంబసభ్యులు
మృతురాలి తండ్రి రమేశ్, కుటుంబీకులు బుధవారం బోథ్ ఆసుపత్రికి చేరుకున్నారు. వారి నుంచి పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అంబులెన్స్‌లో మధ్యప్రదేశ్‌లోని వారి సొంతూరు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment