స్పౌజ్ బదిలీల్లో అక్రమాలు
● అవసరం లేని పాఠశాలలకు టీచర్ల కేటాయింపు ● అధికారుల తీరుతో విద్యార్థులకు అన్యాయం ● ‘మామూలు’గా వ్యవహరించారన్న ఆరోపణలు ● కౌన్సెలింగ్ రద్దు చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు
ఆదిలాబాద్‌టౌన్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా విద్యాశాఖ తీరులో మాత్రం మార్పు రావడం లేదు. విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకోకుండా ఇష్టారీతిన స్పౌజ్ బదిలీలు చేపట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాసుల కోసం కొందరు అధికారులు, ఉద్యోగుల కక్కుర్తి పడ్డారని, అలాగే ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఒత్తిళ్లు సైతం పనిచేశాయని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇటీవల డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసినప్పటికీ ఇంకా చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తున్న విషయం తెలిసిందే. దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న భార్యభర్తలకు ప్రభుత్వం ఇటీవల తీపి కబురు అందించింది. వారి స్పౌజ్ ఉన్న జిల్లాలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ట్రాన్స్‌ఫర్‌పై జిల్లాకు వచ్చిన కొందరు కాసులు ఇచ్చి వారికి అనుకూలంగా ఉన్న పోస్టింగ్ తీసుకున్నారని సమాచారం. ఉపాధ్యాయ పోస్టులు అవసరం ఉన్నచోటికి కాకుండా అవసరం లేని పాఠశాలలకు కేటాయించడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. విషయాన్ని సెకండరీ గ్రేడ్ టీచర్ యూనియన్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్రమ బదిలీలను రద్దు చేసి అవసరం ఉన్నచోటకు ఇవ్వాలని కోరారు.
అవసరం లేని పాఠశాలలకు కేటాయింపు..
ఉపాధ్యాయుల కేటాయింపు విషయంలో కొంతమంది అధికారులు, ఉద్యోగులు నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. వారి స్వార్థం కోసం విద్యార్థులను బలి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని కూర, గుబిడి, అంతర్గాం, నిపాని, గోముత్రి, రుయ్యాడి, భెదోడ, మసాల(బి), గోండుగూడ(సి), కేశవ్‌పట్నం, నర్సాపూర్, సిరిచెల్మ, ఇచ్చోడ ఎస్సీకాలనీ, ధన్నూర్(బి), మర్లపల్లి, కుమారి, వడూర్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పాఠశాలలకు కాకుండా ఇష్టారీతిన కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇదివరకు జరిగిన బదిలీలు, పదోన్నతులు, ఇటీవల జరిగిన డీఎస్సీలో పోస్టుల సంఖ్యకు అనుగుణంగానే ఖాళీలను చూపించారు. ఈ స్పౌజ్ బదిలీల్లో మాత్రం ఇందుకు భిన్నంగా 37 మంది ఉపాధ్యాయులు జిల్లాకు బదిలీపై రాగా, వీరి కోసం ఏకంగా 140 ఖాళీలు చూపించారు. ఈ వ్యవహారంలో అధికారులు, ఉద్యోగుల తీరు అనుమానాలకు తావిస్తోంది. స్పౌజ్ పనిచేస్తున్న మండలంలో అవసరం ఉన్న పాఠశాలకు కేటాయించినట్లయితే అక్కడ ఉపాధ్యాయుల కొరత కూడా తీరి విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉండేది. కానీ అలా చేయకుండా అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
కాసుల కోసం కక్కుర్తి..
మ్యూచువల్ బదిలీల్లో జిల్లాకు 38 మంది రాగా, 37 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వారికి పోస్టింగ్ ఇచ్చి ఉత్తర్వులు అందించారు. వారు ఆ పాఠశాలల్లో ఇటీవల చేరారు. అయితే అవసరం లేని పాఠశాలలను కౌన్సెలింగ్‌లో చూపడం వెనుక కొందరు టీచర్లు భారీగా డబ్బులు ముట్టజెప్పారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన బదిలీలను రద్దు చేసి అవసరం ఉన్న పాఠశాలలకు కేటాయించాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
గుడిహత్నూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో 8 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అవసరం లేకున్నా మరో టీచర్‌ను అక్కడికి కేటాయించారు. మండలంలో వేరే చోట ఖాళీలు ఉన్నప్పటికీ ఈ పాఠశాలకు పోస్టు కేటాయించడం గమనార్హం.
ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని అనుకుంట పాఠశాలలో 57 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలో ఇప్పటికే ముగ్గురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఈ స్పౌజ్ బదిలీల్లో మరో ఇద్దరిని కేటాయించారు. నిబంధనల ప్రకారం ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉండగా అదనంగా మరో ముగ్గురు ఉన్నారు.
జైనథ్ మండలంలోని కంఠ పాఠశాలలో 24 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన స్పౌజ్ బదిలీల్లో ఇక్కడికి మరో టీచర్‌ను కేటాయించారు.
జైనథ్ మండలంలోని కూర పాఠశాలలో 68 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు. ఈ పాఠశాలకు మరొక టీచర్ అవసరం ఉన్నా కేటాయించలేదు. అవసరం లేని పాఠశాలలకు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment