● మహాపూజతో జాతర షురూ ● ఆకట్టుకున్న ‘మెస్రం’ సంప్రదాయ పూజలు ● హాజరైన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ● భక్తజన సందడిగా కేస్లాపూర్‌ | - | Sakshi
Sakshi News home page

● మహాపూజతో జాతర షురూ ● ఆకట్టుకున్న ‘మెస్రం’ సంప్రదాయ పూజలు ● హాజరైన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ● భక్తజన సందడిగా కేస్లాపూర్‌

Published Wed, Jan 29 2025 12:54 AM | Last Updated on Wed, Jan 29 2025 12:54 AM

-

రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంస్కృతి అద్దం పట్టేలా మెస్రం వంశీయులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఉదయం కేస్లాపూర్‌లోని మురాడి నుంచి నాగోబా విగ్రహం, పూజ సామగ్రితో బయలుదేరారు. డోలు, తుడం, కాలీకోమ్‌, పెప్రే వాయిస్తూ పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ముందుగా మైసమ్మ దేవతకు పూజలు చేసి ఆలయంలోనికి ప్రవేశించారు. నాగోబా దర్శనం అనంతరం సంప్రదాయ పూజలు షురూ చేశారు. 22 కితల వారీగా మహిళలు, ఆడపడుచులు వంశపెద్దల ఆశీర్వాదం తీసుకుని కుండలు అందుకున్నారు. అనంతరం వంశ అల్లుళ్లు, ఆడపడుచులు కొత్త కుండలతో మర్రిచెట్టు వద్ద ఉన్న కోనేరుకు చేరుకున్నారు. అక్కడి నుంచి సేకరించిన నీటితో ఆలయానికి వచ్చారు. ప్రదాన్‌ కితకు చెందిన వారు సంప్రదాయ వాయిద్యాలు వాయించగా ఆలయం పక్కన గల పాత మట్టి పుట్టలను అల్లుళ్లు తవ్వారు. ఆ మట్టితో ఆడపడుచులు తిరిగి కొత్త పుట్టలు తయారు చేశారు. సతీదేవత ఆలయం ఎదుట ఏడు వరుసలతో బౌలను తీర్చిదిద్దారు. దానిని గర్భగుడిలో పొందుపరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది.

మహాపూజ

సంప్రదాయ పూజల అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పాదయాత్ర ద్వారా తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. నాగోబాను అభిషేకించి మహాపూజ తంతు నిర్వహించారు (ఈ సమయంలో మెస్రం వంశీయులు మినహా ఇతరులకు అనుమతి ఉండదు). జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పూజలు చేసి మొక్కులు షురూ చేశారు. జాతర ప్రారంభమైనట్లు వంశపెద్దలు ప్రకటించారు. కార్యక్రమంలో మెస్రం పటేల్‌ వెంకట్‌రావ్‌, కటోడ మెస్రం కోసు, వంశ పెద్దలు కోసేరావ్‌, బాదిరావ్‌, లింబారావ్‌, దాదారావ్‌, తిరుపతి, వంశ ఉద్యోగులు మనోహర్‌, దేవ్‌రావ్‌, సోనేరావ్‌, శేఖర్‌బాబు తదితరులున్నారు.

భేటింగ్‌

అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము 3గంటల వరకు భేటింగ్‌ నిర్వహించారు. వంశంలోని కొత్త కోడళ్లు సుమారు వంద మందికి పైగా ఇందులో పాల్గొన్నారు. సతీదేవత, నాగోబా ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం వారు పెద్దల ఆశీర్వా దం తీసుకున్నారు. ఈ కార్యక్రమంతో వారు పూర్తి గా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు.

తరలివచ్చిన భక్తులు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి మెస్రం వంశీ యులు, భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం, ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అలాగే ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను నడిపింది.

నాగోబా.. వారి ఆరాధ్యదైవం. ఆచార, సంప్రదాయాలంటే ప్రాణం. నిండు మనసుతో ప్రత్యేక పూజలు చేసి కొలుస్తారు. పౌర్ణమికి శ్రీకారం చుట్టి అమావాస్యకి కీలక ఘట్టానికి చేరువవుతారు. తెల్లని వస్త్రాలతో స్వచ్ఛతకు ప్రతీకగా నిలుస్తారు. పవిత్ర గంగాజలం కోసం మైళ్ల దూరం సైతం లెక్కచేయరు. సామూహిక పాదయాత్రతో ముందడుగు వేస్తారు. ఆరాధ్య దైవాన్ని అభిషేకించి గిరిజన జాతరకు శ్రీకారం చుడుతారు. ఆడపడుచులు, అల్లుళ్లకు పెద్దపీట వేస్తూ ఆనవాయితీ తప్పని ఆ గిరిపుత్రులే మెస్రం వంశీయులు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా తమ ఇలవేల్పును ఆరాధించారు. మహాపూజకు శ్రీకారం చుట్టారు. కేస్లాపూర్‌ను భక్తజన సందడిగా మార్చారు. – ఇంద్రవెల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement