తల్లి, తమ్ముడుతో సాహితి
రాజవొమ్మంగి: అతి పిన్న వయసు నుంచి పాటలు పాడుతూ సంగీత ప్రియులకు గానమాధుర్యాన్ని అందిస్తున్న చాగంటి సాహితి రాజవొమ్మంగిలో పుట్టి పెరిగింది. తండ్రి చాగంటి రవిప్రసాద్ ఉద్యోగరీత్యా కాకినాడ, ఆ తరువాత హైదరాబాద్‌లో వెళ్లాల్సి రావడంతో సాహితి అక్కడే సంగీతం నేర్చుకొంది. ఆమె రాజవొమ్మంగి మాజీ కరణం వాడ్రేవు సుబ్రహ్మణ్య జగత్పతి మనుమరాలు. తల్లి సీతాదేవి, తమ్ముడు శశాంక్ ఇక్కడికి వచ్చిన ఆమె దేశ విదేశాల్లో తనకు లభిస్తున్న ఆదరణను ‘సాక్షి’తో పంచుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
► తల్లి సీతాదేవికి పాటలంటే ఎంతో ఇష్టం. దాదాపు 30 ఏళ్ల క్రితం మాట. అప్పట్లో పాడాలని, మంచి గాయనిగా ఎదగాలని ఉన్నా ఆమెకు పరిస్థితులు సహకరించలేదు.
► నేను పొత్తిళ్లలో ఉండగా అమ్మ హనుమాన్‌చాలీసా పాడేది. అలా గానం పట్ల ఆసక్తి పెరిగింది. చిన్న వయసులోనే ఆ చాలీసాను అవలీలగా పాడేసేదాన్ని.
► చంటిపిల్లగా ఉన్నప్పుడే అమ్మ సినిమాపాటలు, భక్తిగీతాలు పాడటం నేర్పింది. ఎవరికై నా తొలి గురువు అమ్మేకదా. కాకపోతే తాను గాయని కావాలన్న కోరిక నన్ను గాయనిగా చేసి తీర్చుకుంది. ఆమె రుణం తీర్చుకోలేనిది.
► అమెరికా వంటి దేశాల్లో కూడా ప్రోగ్రాం ఇస్తున్నాను. ఆచార్య, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల్లో పాడిన పాటలు నాకు మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.
► నాకు 4, 5 ఏళ్ల వయసులో చాలా వరకు అమ్మే సంగీతం నేర్పింది. ఆ తరువాత కాకినాడలో పెద్దాడ సూర్యకుమారి వద్ద కర్నాటక సంగీతం నేర్చుకున్నా. ఆ తరువాత హైదరాబాద్‌లో ఎంసీ మూర్తి వద్ద సుధీర్ఘంగా 10 ఏళ్ళ పాటు సంగీతం నేర్చుకొన్నాను. రామాచారి, శ్రీనిధి వెంకటేష్‌లు నా ప్రస్తుత సంగీత గురువులు.
► ఇప్పటివరకు సుమారు వంద పాటలు పాడాను. ప్రముఖ గాయనిలు లతామంగేష్కర్, ఆశ, జానకి మాదిరిగా పాటలు పాడుతూనే ఉండాలన్నది కోరిక. మణిశర్మ దర్శకత్వంలో పాటలు పాడే అవకాశం లభించడం నా అదృష్టం. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, కీరవాణి నా అభిమాన సంగీత దర్శకులు.
► ఆచార్య, కాటంరాయుడు, ఆచార్య, భీమ్లానాయక్ తదితర సినిమాల్లో పాడిన పాటలు నాకు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి. సరిగమప, లిటిల్ చాంప్స్, పాడుతా తీయగా వంటి టీవీ షోల్లో పాడిన పాటలతో చిన్నతనంలోనే ఎంతో గుర్తింపు తెచ్చాయి.
► బద్రీనాథ్ సినిమాలో ఓ చిన్న శ్లోకం ఆలపించే అవకాశం రావడం మరిచిపోలేని మధుర సంఘటన. వాణీజయరాం, బాలసుబ్రహ్మణ్యం, కోటి వంటి ప్రముఖ గాయకులు భుజం తట్టి ప్రోత్సహించారు.
► 2020 నుంచి ఇప్పటివరకు మూడు ఆల్బమ్స్ చేశాను. ప్రేక్షకుల ఆదరాభిమానాలే సంగీత ప్రయాణానికి చుక్కాని.
Comments
Please login to add a commentAdd a comment