నాటు పడవ బోల్తా | Sakshi
Sakshi News home page

నాటు పడవ బోల్తా

Published Mon, May 6 2024 9:00 AM

నాటు పడవ బోల్తా

ముంచంగిపుట్టు : ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన జోలాపుట్టు జలాశయం దిగువ ప్రాంతంలో శనివారం నాటు పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన గిరిజనుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒడిశాలోని బంగురుపడా గ్రామానికి చెందిన ఉద్ధవ్‌ కోరా (35) శనివారం సాయంత్రం కుంబిపడా గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి నాటు పడవలో బయలుదేరాడు. ఈ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు అతని పడవ బోల్తా పడింది. ఉద్ధవ్‌ కుంబిపడాకు రాలేదని బంధువులు తెలపడంతో రాత్రి 9 గంటల సమయంలో కుటుంబ సభ్యులు గెడ్డ ప్రాంతానికి వెళ్లి చూడగా నాటు పడవ నదిలో తేలుతూ కనిపించింది. దీంతో ప్రమాదం జరిగిందని భావించిన కుటుంబ సభ్యులు రాత్రి అయినా గాలించారు. అయితే ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాక గాలింపు నిలిపేశారు. ఆదివారం ఉదయం మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం అధికారులకు విషయం తెలిపారు. దీంతో స్పందించిన అధికారులు జోలాపుట్టు జలాశయం నుంచి డుడుమకు నీటి విడుదలను నిలుపుదల చేశారు. ఒడిశా లంతాపుట్టు నుంచి ఓడ్రాఫ్‌ బృందాలు, అగ్నిమాపక సిబ్బందిని రప్పించి గాలించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉద్ధవ్‌ మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం జోలాపుట్టు జలాశయం నుంచి నీటి విడుదలను పునరుద్ధరించారు. నీటి విడుదల నిలిపివేయడం వల్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం కలగలేదని, ప్రస్తుతం రెండు జనరేటర్లతో 44 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని మాచ్‌ఖండ్‌ ప్రాజెక్టు ఆధికారులు తెలిపారు.

ఒడిశా వాసి మృతి

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

Advertisement
Advertisement