స్మారకం.. నిర్లిప్తం | - | Sakshi
Sakshi News home page

స్మారకం.. నిర్లిప్తం

Published Mon, Nov 25 2024 8:16 AM | Last Updated on Mon, Nov 25 2024 8:16 AM

స్మార

స్మారకం.. నిర్లిప్తం

నత్తనడకన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులు

సాక్షి, పాడేరు: గిరిజన పోరాటయోధుల చరిత్రతో పాటు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి స్ఫూర్తి నింపేందుకు చేపట్టిన స్వాతంత్య్ర సమరయోధుల స్మారక మ్యూజియం పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. 2017లో మంజూరైన ఈ మ్యూజియంపై ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. లంబసింగి–తాజంగి ప్రధాన రోడ్డును ఆనుకుని సుమారు 21.67 ఎకరాలు కేటాయించింది. 2021లో అక్టోబర్‌ పదిన అప్పటి డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి శంకుస్థాపన చేశారు. ఆజాద్‌కి అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఏపీ గిరిజన సంక్షేమశాఖ సంయుక్తంగా రూ.35 కోట్లతో ఈ నిర్మాణ పనులు చేపట్టాయి. లంబసింగి–తాజంగి ప్రధాన రోడ్డును ఆనుకుని ప్రారంభించిన ఈ కట్టడం పనులు మూడేళ్లలో పూర్తి కావాలి. అయితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా పనులతీరు ఉంది. ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలకు రూ.8 కోట్లు ఖర్చు చేసినట్టు సంబంధిత అధికారవర్గాలు తెలిపాయి. ఈ స్మారక మ్యూజియం నిర్మాణం పూర్తయితే లంబసింగి పర్యాటక ప్రాంతానికి జాతీయస్థాయి మంచి గుర్తింపు వస్తుందని స్థానికులు భావించారు. ఇప్పుడు ఈ నిర్మాణం తీరును చూసి నిరాశకు గురవుతున్నారు.

● నాటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను సందర్శకుల కళ్లకు కట్టినట్టు వివరించేందుకు 300 మంది కూర్చొని వీక్షించేలా డిజిటల్‌ థియేటర్‌ నిర్మించాల్సి ఉంది. ట్రైబల్‌ థీమ్‌ హట్‌తో కూడిన రెస్టారెంట్‌, ఓపెన్‌ థియేటర్‌, స్వాగత ప్లాజా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. మన్యం కేంద్రంగా సాగిన స్వాతంత్య్ర సమరానికి సంబంధించి ఆధారాలు, గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించి మూలాలను సేకరించేందుకు గత ప్రభుత్వంలో అధికార యత్రాంగం సమాయత్తం చేసింది.

మ్యూజియంలో ప్రవేశ ప్లాజా, రెస్టారెంట్‌తో కూడిన గిరిజన హట్‌, యాంఫీ థియేటర్‌ నిర్మించాల్సి ఉంది. ఇవి పూర్తయితే కొండదొర, సారిక తదితర గిరిజనులు వినియోగించిన వస్తువులు, ఆయుధాలు, గొలుసులను అధికారులు ప్రదర్శిస్తారు.

● చింతపల్లి పరిసర ప్రాంతాలలోని కొండలు, లోయలు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన గిరిజన స్వాతంత్య్ర ఉద్యమాల్లో ఒకటైన చరిత్రాత్మకమైన రంప తిరుగుబాటును గుర్తు చేసేలా మ్యూజియంను తీర్చిదిద్దాల్సి ఉంది.

● అల్లూరి సీతారామరాజును పట్టుకునేందుకు 1924లో రూథర్‌ఫర్డ్‌ సందర్శించిన లంబసింగిలోని అతిథి గృహం శిథిలమైంది. దీని సమాచారం మ్యూజియంలో అందుబాటులో ఉంచాలని గత ప్రభుత్వం సంకల్పించింది.

● ప్రకృతి, ఆధ్యాత్మికత మరియు గిరిజన జీవన విధానానికి సంబంధించిన ఇతివృత్తాలను తెలియజేసేలా సవర చిత్రాలను మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది.

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం..

మ్యూజియం నిర్మాణ పనులకు నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పనులు నత్తనడకన జరగడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● ప్రస్తుతం జాతీయ రహదారి 516 రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి. దీనిని ఆనుకుని మ్యూజియం నిర్మాణం చేపట్టారు. తాజంగి ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు అసంపూర్తి భవనాలు దర్శనమిస్తున్నాయి.

మూడేళ్లలో జరిగింది 30 శాతం మాత్రమే

పుష్కలంగా నిధులున్నా..

తాజంగిలో సాగని నిర్మాణాలు

గత ప్రభుత్వ ఆశయానికి నిర్లక్ష్యం గండి

పనులు వేగవంతం చేస్తాం

తాజంగిలోని స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. ఈ మేరకు ఇటీవల గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌శాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చాం. పనుల్లో జాప్యం లేకుండా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని భవన నిర్మాణ పనులను ఇప్పటికే కాంట్రాక్టర్లు ప్రారంభించారు.

– వి.అభిషేక్‌, పీవో, పాడేరు ఐటీడీఏ

No comments yet. Be the first to comment!
Add a comment
స్మారకం.. నిర్లిప్తం1
1/1

స్మారకం.. నిర్లిప్తం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement