గొంతు నొక్కితే సహించం
● తప్పుడు కేసులకు భయపడం
● సీఐ రేవతమ్మపై చర్యలు తీసుకోవాలి
● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ డిమాండ్
నర్సీపట్నం: టీడీపీ నాయకులకు తొత్తులా వ్యవహరిస్తున్న నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. స్పీకర్ సిహెచ్. అయ్యన్నపాత్రుడి ఆదేశాల మేరకు సీఐ తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. సీఐ వైఖరిని నిరసిస్తూ పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఐ వైఖరిని ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు పోలీసు స్టేషన్ ముందు శాంతియుత ధర్నా తలపెట్టామన్నారు. నిరసన వ్యక్తం చేసేందుకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని పోలీసులపై ఆయన గ్రహం వ్యక్తం చేశారు. రాబోయేది తమ ప్రభుత్వమే ఖబడ్దార్ అంటూ పోలీసులను హెచ్చరించారు. ఇసుక దొంగలకు కొమ్ము కాసి ఇసుక అక్రమ రవాణాను వెలుగులోకి తెచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. సీఐ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గబ్బాడ ఇసుక డిపోలో అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు చేసిన నాయకులపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు.
ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసేందుకు పార్టీ నాయకులతో తాను స్టేషన్‌కు వెళ్తే సీఐ టీడీపీ కార్యకర్తలా మాట్లాడారని ఆరోపించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఆదేశాలతో సీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఐ రేవతమ్మ వ్యవహారశైలికి నిరసనగానే తాము పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. టీడీపీ నాయకులు, సీఐ ఏకమై పెట్టే తప్పుడు కేసులకు భయపడేదిలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment