కీచక రాజ్యం?
● బాలికలపై అఘాయిత్యాలు అరికట్టండి ● లైంగిక దాడులపై కదం తొక్కిన విద్యార్థి లోకం
ఎన్నాళ్లీ
యలమంచిలి రూరల్: రాష్ట్రంలో వరుసగా మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను పకడ్బందీగా అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం యలమంచిలి పట్టణంలో వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పట్టణానికి చెందిన 13 ఏళ్ల బాలికపై 27 ఏళ్ల సీనియర్ హాకీ క్రీడాకారుడు మళ్ల రూపేష్ లైంగిక దాడికి పాల్పడిన ఘటనను ఖండిస్తూ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో వైఎస్సార్ కూడలి నుంచి పాత ప్రభుత్వాస్పత్రి వరకు ర్యాలీ చేసిన తర్వాత కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కె.వరహాలుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చింతకాయల శివాజీ, ఎం.రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట బాలికలపై అఘాయిత్యాలు జరగడం దారుణమన్నారు. ముఖ్యంగా గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అమ్మకాలు, వినియోగం, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంటున్న పోర్న్ వీడియోల ప్రభావంతో అత్యాచారాలు, దౌర్జన్యాలు మరింత ఎక్కువ అవుతున్నాయని, ఈ పరిస్థితిని ప్రభుత్వం వెంటనే చక్కదిద్దాలన్నారు. నిందితుడు మళ్ల రూపేష్‌ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, దీనికోసం ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. బాధిత బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఆ బాలిక చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మద్యం బెల్టు షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయని వీటిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు ఆర్.లక్ష్మి, యలమంచిలి డివిజన్ కార్యదర్శి సీహెచ్ మంగ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అభి, లక్ష్మణ్, సునీల్, రాము, కృప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment