భారీ ఎత్తున గంజాయి ధ్వంసం
● రూ.17.6 కోట్ల విలువైన 35 వేల కిలోల సరకు దహనం ● 39 కేజీల హాష్ ఆయిల్ కూడా.. ● హాజరైన డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఈగల్ ఐజీ రవికృష్ణ
సాక్షి, అనకాపల్లి: జిల్లాలో గత నాలుగేళ్లుగా పట్టుబడిన గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పోలీసులు ధ్వంసం చేశారు. మంగళవారం పరవాడ జేఎన్ ఫార్మాలో కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు వద్ద జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో జిల్లాలో పట్టుబడిన రూ.17.6 కోట్ల విలువైన 35 వేల కిలోల గంజాయి, 39 కేజీల హాష్ ఆయిల్‌ను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఇన్సినరేషన్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీజీపీ ద్వారకా తిరుమలరావు జిల్లాలో పట్టుబడిన గంజాయిని డివిజన్ల వారీగా సందర్శించారు. అనంతరం మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశారు. దఫదఫాలుగా నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధానాన్ని అనుసరించి, డీజీపీ ఆదేశాల మేరకు.. జిల్లాలో పట్టుబడిన గంజాయిని దహనం చేస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 459 కేసుల్లో పట్టుబడిన 35 వేల కిలోల గంజాయి, 39.4 కేజీల హాష్ ఆయిల్ ధ్వంసం చేశామన్నారు. ఈ కేసుల్లో 1304 మందిని అరెస్ట్ చేసి, 205 వాహనాలు సీజ్ చేశామన్నారు. గంజాయి రవాణాను అడ్డుకునేందుకు అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ప్రధాన రవాణా మార్గాలను గుర్తించి 5 శాశ్వత చెక్‌పోస్టులు, 24 డైనమిక్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిందన్నారు. ఈ చెక్‌పోస్టులు 24 గంటలూ పనిచేయడమే కాకుండా సీసీ టీవీ కెమెరాలు, పోలీస్ డాగ్ స్క్వాడ్‌తో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పనిచేస్తున్నాయని తెలిపారు. కాలిబాట, ఇతర రవాణా మార్గాలపై గంజాయి రవాణాను నిరోధించడానికి 3 డ్రోన్లను వినియోగిస్తున్నామని, 470 మంది అనుమానితులపై 3 కేడీ షీట్లు, 4 రౌడీ షీట్లు తెరవడం జరిగిందని, 11 మంది అలవాటు పడిన నేరస్థులపై పీడీ యాక్టు ప్రయోగించామన్నారు.
అవగాహన కార్యక్రమాలు
జిల్లాలో ‘సంకల్పం’ పేరుతో 360 పాఠశాలలు, 156 కళాశాలల్లో మాదక ద్రవ్యాల వల్ల అనర్థాల గురించి అవగాహన కల్పించామని, కళాశాలల్లో 136 యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులు గంజాయికి బానిసలుగా కాకుండా పర్యవేక్షిస్తున్నామన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 15 కేసుల్లో 26 మంది నేరస్తులకు 5 నుంచి 20 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష పడిందన్నారు. ఈగల్ డైరెక్టర్ ఐజీ ఆకే రవికృష్ణ, డీఐజీ గోపీనాథ్ జెట్టి, కలెక్టర్ విజయ కృష్ణన్, అల్లూరి ఎస్పీ అమిత్ బర్దర్, ఈగల్ ఎస్పీ కె.నగేష్‌బాబు, అదనపు ఎస్పీ కె.ధీరజ్, అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, అనకాపల్లి ఆర్డీవో షేక్ ఆయిషా, డీఎస్పీలు బి.అప్పారావు, వి.విష్ణుస్వరూప్, పి.శ్రీనివాసరావు, శ్రావణి, ఇ.శ్రీనివాసులు, సీఐ మల్లికార్జునరావు, గణేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment