హాకీ సంఘం నుంచి పోక్సో కేసు నిందితుడి తొలగింపు
రాజీవ్ క్రీడా మైదానంలో మీడియాతో మాట్లాడుతున్న హాకీ అసోసియేషన్ ప్రతినిధులు
యలమంచిలి రూరల్: పదమూడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ హాకీ క్రీడాకారుడు మళ్ల రూపేష్‌ను జిల్లా హాకీ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్టు సంఘం కార్యదర్శి కొఠారు నరేష్ తెలిపారు. మంగళవారం సాయంత్రం యలమంచిలి రాజీవ్ క్రీడా మైదానంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. రాష్ట్ర హాకీ అసోసియేషన్ ప్రతినిధుల ఆదేశాలతో జిల్లా హాకీ సంఘం అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. హాకీ క్రీడాకారిణిపై లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటనను తామంతా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత బాలికకు జిల్లా హాకీ సంఘం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా హాకీ సంఘం ఉపాధ్యక్షుడు రాంబాబు, రాజా పలువురు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment