
విద్యుత్ స్తంభం మార్పుపై ఇరువర్గాల వివాదం
నాతవరం: ఇంటి వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని పక్కకు మార్పు చేయడంపై ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. జిల్లేడుపూడి గ్రామంలో లాలం నూకరాజు కొత్తగా నిర్మించిన ఇంటి గేటు ముందు విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా దర్శనమిస్తుంది. ఈ స్తంభం మార్పు చేయడం కోసం విద్యుత్ శాఖ అధికారుల ఆదేశాల ప్రకారం గత నెల 25వ తేదీన లాలం నూకరాజు విద్యుత్‌శాఖకు రూ.69,500 ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశారు. ఈనెల 16వ తేదీన విద్యుత్ స్తంభం మార్పు చేసేందుకు జిల్లేడుపూడిలో నూకరాజు ఇంటి వద్ద సిబ్బంది పనులు ప్రారంభించారు. కొత్తగా స్తంభం ఏర్పాటుకు పాత స్తంభం తొలగించేందుకు గొయ్యి తీశారు. అయితే ఆ సమయంలో సర్పంచ్ లాలం రమణ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ద్వారా పనులు నిలుపుదల చేయించారు. కొత్తగా విద్యుత్ స్తంభం వేసే ప్రదేశంలో పంచాయతీ డ్రైనేజీ నిర్మిస్తామంటూ పనులను అడ్డుకున్నారు. పంచాయతీకి సమాచారం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు విద్యుత్ స్తంభం మార్చుకుంటే ఎలా ఊరుకుంటామని సర్పంచ్ రమణ భీిష్మించారు. విద్యుత్ స్తంభం మార్పు కోసం ఆదివారం వైర్లు తొలగించడంతో గ్రామంలో సోమవారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నర్సీపట్నం విద్యుత్ శాఖ ఏడీ సునీల్‌కుమార్, నాతవరం జేఈ చంద్రమౌళి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారుల ఎదుట ఇరుపార్టీల నాయకులు వివాదానికి దిగారు. విద్యుత్ స్తంభం వేయరాదని సర్పంచ్ రమణ, నిబంధనల మేరకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాం కాబట్టి గొయ్యి తీసిన స్థలంలో స్తంభం వేయాలని మాజీ సర్పంచ్ లోవ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గత్యంతరం లేక అధికారులు విద్యుత్ స్తంభం మార్పును వారం రోజుల పాటు వాయిదా వేసి విద్యుత్ పునరుద్ధరించి వెళ్లిపోయారు. ఈ విషయమై ఏడీ సునీల్‌కుమార్ మాట్లాడుతూ స్తంభం మార్పుకు వినియోగదారుడు డబ్బులు కట్టారని, ఈనెల 25వ తేదీ వరకు స్తంభం మార్పుకు సమయం ఉందన్నారు. రాజకీయ నాయకులు సమస్య సృష్టిస్తే పని చేయడం కష్టమన్నారు.

విద్యుత్ స్తంభం మార్పుపై ఇరువర్గాల వివాదం
Comments
Please login to add a commentAdd a comment