23న ఫ్లాంట్ పరీక్ష నిర్వహణ
తుమ్మపాల : ఈ నెల 23న జరిగే ఫ్లాంట్ (ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ – ఎసెస్‌మెంట్ టెస్ట్) పరీక్షను జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఫ్లాంట్ పరీక్ష నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్‌లో ఆమెతో పాటు జేసీ ఎం.జాహ్నవి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉల్లాస్ అక్షరాస్యతా కార్యక్రమంలో భాగంగా, జిల్లాలో మహిళా స్వయంశక్తి సంఘాల్లో గల నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులను చేయడానికి మొదటి దశలో 11,900 మంది అభ్యాసకులను నమోదు చేసి, 1,190 మంది అక్షరాస్యులతో అక్షరాస్యతా కేంద్రాలను ఏర్పాటు చేసి వాలంటరీ టీచర్ల ద్వారా చదువు నేర్పడం జరిగిందన్నారు. ఆయా అభ్యాసకులకు ఈ నెల 23న అంగన్‌వాడీ కేంద్రాలలో పాఠశాలో ఫ్లాంట్ పరీక్ష నిర్వహించాలన్నారు. అంగన్‌వాడీ టీచర్, సెకండరీ గ్రేడు టీచర్ పరీక్ష నిర్వాహకులుగా వ్యవహరించాలన్నారు. వయోజన విద్యాశాఖ నుంచి పరీక్ష పేపర్లు, సంబంధిత సామగ్రి అందజేయనున్నట్టు తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో సంబంధిత శాఖలు సమన్వయంతోని ఫ్లాంటు పరీక్షను నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో వై.సత్యనారాయణరావు, వయోజన విద్య ఉప సంచాలకుడు ఎస్.ఎస్.వర్మ, నోడల్ అధికారి డి.చిన్నికృష్ణ, డీఆర్డీఏ పీడీ కె.శచీదేవి, ఐసీడీఎస్ పీడీ కె.అనంతలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment