చెరకు రైతులను నట్టేట ముంచారు..
● ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి అధోగతి ● గిట్టుబాటు ధర కల్పించక, పేమెంట్లు చెల్లించక రైతన్న కష్టాలపాలు ● అసలే ఆలస్యం, తరచూ క్రషింగ్‌కు అంతరాయం ● సాగు చేసిన రైతే చెరకు పంటకు నిప్పు పెట్టిన దయనీయ స్థితి ● వైఎస్ జగన్ హయాంలో గోవాడ ఫ్యాక్టరీకి రూ.90 కోట్లు విడుదల ● మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు
దేవరాపల్లి: గోవాడ సుగర్ ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. దేవరాపల్లి మండలం మేడిచెర్ల రెవెన్యూ పరిధిలో చెరకు పంటకు రైతు నిప్పు పెట్టిన పొలాన్ని బుధవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. కొత్తపెంట గ్రామానికి చెందిన బాధిత రైతు రొంగలి వెంకటరావును ఆయన పరామర్శించి, అతడి కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ఫ్యాక్టరీ ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితికి దిగజారిందని విమర్శించారు. ఫ్యాక్టరీపై ఆధారపడి చెరకు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. జిల్లాకు కొత్త పరిశ్రమలు తెస్తామంటూ ప్రచారం చేస్తున్న కూటమి నేతలు, ముందు సహకార రంగంలో ఉన్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీని కాపాడాలన్నారు. నవంబర్ నెలాఖరులో ప్రారంభించాల్సిన ఫ్యాక్టరీ క్రషింగ్‌ను సంక్రాంతి దాటాక ఆలస్యంగా ప్రారంభించడం నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు. అసలే ఆలస్యం.. ఆపై తరుచూ అంతరాయంతో రోజుల తరబడి కాటా వద్ద, ఫ్యాక్టరీ వద్ద చెరకు నిలిచిపోయి ఎండిపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలోనే యాజమాన్యం, ప్రభుత్వం తీరుపై ఆగ్రహించిన రైతులు ఇటీవల ఫ్యాక్టరీ వద్ద స్వచ్ఛందంగా ప్రత్యక్ష ఆందోళన చేశారన్నారు. తాజాగా ప్రభుత్వ తీరు పట్ల కలత చెందిన కొత్తపెంట రైతు తన చెరకు పంటకు తానే నిప్పు పెట్టుకున్నారని, ఈ ఘటనతోనైనా కూటమికి కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. చంద్రబాబు ఎప్పుడు గద్దెనెక్కినా అన్నదాతలకు అగచాట్లేనన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటినా అన్నదాత సుఖీభవ పేరిట రూ.20 వేలు పెట్టుబడి సహాయం ఊసెత్తకపోవడం రైతులను మోసగించడమేనన్నారు.
గోవాడను ఆదుకున్నది వైఎస్సార్, వైఎస్ జగన్‌లే..
2004లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి టన్నుకు ఒకేసారి రూ.1100 గిట్టుబాటు ధర పెంచి గోవాడ రైతులకు అండగా నిలవగా, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.90 కోట్లు విడుదల చేసి చెరకు రైతులను ఆదుకున్నారని ముత్యాలనాయుడు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఐదేళ్లలో రైతులు, కార్మికులు సుభిక్షంగా ఉన్నారన్నారు. ఇప్పటికై నా చెరకు రైతుల బకాయిలు చెల్లించేందుకు తక్షణమే రూ.35 కోట్లు విడుదల చేయాలని, ఫ్యాక్టరీ ఆధునికీకరణకు రూ.350 కోట్లు మేర మంజూరు చేయాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు. ఆయన వెంట స్థానిక ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, స్థానిక సర్పంచ్ రొంగలి వెంకటరావు (నీలిమ), ఎ.కొత్తపల్లి సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ, మాజీ సర్పంచ్ రొంగలి శంకరరావు, రెడ్డి అప్పారావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment