ఫ్లై ఓవర్ వద్దే..వద్దు
అచ్యుతాపురం రూరల్ : అచ్యుతాపురం కూడలిలో ఫ్లై–ఓవర్ నిర్మాణం చేయడం వల్ల మరింత కాలుష్యం పెరుగుతుందని అచ్యుతాపురం భవన నిర్మాణ యజమానుల సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లై–ఓవర్ కారణంగా అచ్యుతాపురం గ్రామం పూర్తిగా కాలుష్యానికి గురై ప్రజలు అనారోగ్య పాలౌతారని గృహ నిర్మాణ యజమాన సంఘం సభ్యులు ఆదివారం జరిగిన సమావేశంలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ రహదారులు నిర్మాణాలు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నప్పటికీ వాటి జోలికి పోకుండా ప్రజల ఆరోగ్య స్థితిగతులపై దెబ్బ తీసేవిధంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుందని ఆరోపించారు. గ్రామంలో ఇప్పటికే ఉన్న సుమారు 200 పైబడి పరిశ్రమలకు చెందిన వాహనాలు రాకపోకల కారణంగా స్థానిక ప్రజలు వాయు, శబ్ధ కాలుష్యంతో అనారోగ్య ఇబ్బందులకు గురి అయ్యారన్నారు. సెజ్‌లో ఉన్నటువంటి పరిశ్రమలకు వాహనాలు రాకపోకలూ చేసేందుకు అచ్యుతాపురం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడితే అచ్యుతాపురంలో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ నియంత్రణ చేయొచ్చునన్నారు.
కోటి విద్యలు కూటి కోసమే అన్న చందాన ఎన్ని వ్యాపారాలు, ఉద్యోగాలు చేసినా ఆరోగ్యమైన జీవనం సాగించడానికే, అటువంటి ఆరోగ్యాన్ని అభివృద్ధి పేరుతో నిర్మిస్తున్న ఫ్లై–ఓవర్ కారణంగా ఛిద్రం చేయడం తగదన్నారు. సెజ్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులు ప్రభుత్వ పరిహారంతో ఎక్కువ శాతం అచ్యుతాపురంలో పూడిమడక రహదారిలో గృహ నిర్మాణాలు చేసుకున్నారని, ఇపుడు రెండోసారి అభివృద్ధి పేరుతో ఇక్కడి నిర్మాణాల కారణంగా కాలుష్యం పెరిగి వారంతా మరోచోటికి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంటుందేమోనని ఆవేదన చెందారు. ఫ్లై–ఓవర్ కోసం చేస్తున్న విస్తరణల కారణంగా నివాస స్థలాలను, ఉపాధిని కోల్పోతామని భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో పునరాలోచనతో స్థానిక ప్రజల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించాలని కోరుతున్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణాల సంఘం అధ్యక్షుడు దేశంశెట్టి అప్పలనాయుడు, ఉపాధ్యక్షుడు రాజాన సన్యాసినాయుడు, కార్యదర్శి బండారు కుమార్, గౌరవ అధ్యక్షుడు పల్లి శేషగిరిరావు, సహాయ కార్యదర్శి శరగడం శ్రీధర్, పంచదార్ల రవి, నీరుకొండ సూర్య చంద్రరావు, సీపీఎం నాయకులు జి.కోటేశ్వర్రావు, రొంగలి రాము, బుద్దా రంగారావు, మారిశెట్టి వెంకటప్పారావు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
ఇప్పటికే కాలుష్యం బారిన అచ్యుతాపురం
రింగు రోడ్డుతోనే ట్రాఫిక్ సమస్యపరిష్కారం
భవన యజమానుల సంఘం నిరసన
Comments
Please login to add a commentAdd a comment