● స్పీకర్ అయ్యన్నపాత్రుడు ● నర్సీపట్నం పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా ఉద్యోగ విజయోత్సవం
నర్సీపట్నం: పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కోర్సులు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్లొని, కళాశాలలో విద్యను అభ్యసిస్తూ పలు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారికి ఉద్యోగ పత్రాలను అందజేశారు. కొత్త కోర్సులు వస్తే విద్యార్థులకు మరిన్ని విజయాలు సిద్ధిస్తాయన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985లో పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించామని, అప్పట్లో ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు మాత్రమే ఉండేవన్నారు. 1986లో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సును ప్రారంభించారని, ఉత్తీర్ణత శాతం 96 వరకు ఉందన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారన్నారు. ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్స్‌లో ఈసీఈ బ్రాంచ్‌లో 50 మంది, మెకానికల్ బ్రాంచ్‌లో 39మంది, మైనింగ్ బ్రాంచ్‌లో ఆరుగురికి ఉద్యోగావకాశాలు వచ్చాయన్నారు. 42 మంది విద్యార్థులు అమెజాన్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, టెక్ మహీంద్ర వంటి ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.