ప్రొద్దుటూరు క్రైం : క్షుద్రపూజల పేరుతో మహిళలను ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. తిరుపతికి చెందిన బాధిత మహిళ ఫిర్యాదుతో ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ముఠాలోని ఏడుగురు సభ్యులను వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారుడు అయిన బాబా కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణాకుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. తిరుపతికి చెందిన ఒక మహిళ ఆర్థిక సమస్యలతో బాధపడేది.
తన కుమార్తెలకు వయసు వచ్చినా ఇంకా పెళ్లిళ్లు కాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యేవారు. ఈ క్రమంలో ఓ బాబా క్షుద్రపూజలు చేస్తే ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబంలోని ఇతర సమస్యలు కూడా పూర్తిగా తీరిపోతాయని ఒక మహిళ ద్వారా తెలుసుకున్న ఆమె.. సదరు ముఠా సభ్యులను ఆశ్రయించింది. తిరుపతి మహిళను ఫోన్‌లో సంప్రదించిన మోసగాళ్లు ఆమెను కడపకు రమ్మని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ముఠా సభ్యులు కొందరు ఆమెతో కడపలో సమావేశం అయ్యారు.
అయితే వారు పెట్టిన కొన్ని షరతులకు ఆమె అంగీకరించకపోవడంతో రెండు రోజుల క్రితం తిరిగి వారు ప్రొద్దుటూరులో సమావేశమయ్యారు. ఈ క్రమంలో పూజలు చేస్తామని నమ్మబలికిన కేటుగాళ్లు ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేశారు. దీంతో వారి బారి నుంచి తప్పించుకుంది. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏడుగురు నిందితుల అరెస్ట్
ఏఎస్పీ ప్రేరణాకుమార్ ఆదేశాల మేరకు సీఐ యుగంధర్, ఎస్‌ఐ కృష్ణంరాజునాయక్‌లు సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముఠా సభ్యులు అమృతానగర్‌లో ఉన్నారని తెలియడంతో దాడులు నిర్వహించారు. దాడిలో అనంతపురం జిల్లాకు చెందిన వసారింటి నాగరాజు, కంబగిరి రాముడు, వడ్డే వెంకటేష్, కర్నూలు జిల్లాకు చెందిన మార్కె కంబగిరి రాముడు, మొట్టే కాంతమ్మ, నంద్యాల జిల్లాకు చెందిన జిట్టా రవికుమార్, తిరుపతికి చెందిన పొలిచెర్ల ప్రియను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపిస్తునట్లు ఏఎస్పీ తెలిపారు. విచారణలో భాగంగా నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన సూత్రధారి బాబా, మరి కొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నం..
ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న మహిళలను ఈ ముఠా టార్గెట్ చేస్తోంది. ఇందుకోసం ముఠాలోని మహిళలను ఏజెంట్లుగా ఉపయోగించుకుంటున్నారు. వారి ద్వారానే అమాయక మహిళలను ట్రాప్ చేస్తున్నారు. కుద్ర పూజలకు అంగీకరించిన మహిళలను లొంగదీసుకొని వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నం జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
కాగా ప్రొద్దుటూరుతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల వ్యభిచార నిర్వాహకులతో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వీరి ఉచ్చులో పడి ఎంత మంది మహిళలు మోసపోయారనే దానిపై కూడా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ యుగంధర్, ఎస్‌ఐ కృష్ణంరాజునాయక్, బ్లూకోల్ట్స్ సిబ్బందిని ఎస్పీ అన్బురాజన్, ఏఎస్పీ ప్రేరణాకుమార్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment