అనంతపురం క్రైం: ప్రేమ పేరుతో ఓ యువతి జీవితాన్ని నరకప్రాయం చేశాడో వంచకుడు. అదే యువతిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి తెగబడ్డాడు మరో దుర్మార్గుడు. ఎస్పీ ఆదేశాలతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను కటకటాల వెనక్కి పంపారు. స్థానిక దిశ పోలీసు స్టేషన్‌లో శనివారం డీఎస్పీ ఆంథోనప్ప వెల్లడించిన వివరాల మేరకు.. పెద్దవడుగూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన మొలకతాళ్ల్ల కృష్ణారెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడు. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించేవాడు.
తను పట్టించుకోకపోవడంతో బ్లాక్ మెయిల్‌కు దిగాడు. బెంగళూరుకు పిలిపించుకొని స్నేహితుల గదికి తీసుకెళ్లి శారీరకంగా అనుభవించాడు. ఈ విషయం కృష్ణారెడ్డి క్లాస్‌మేట్, గుంతకల్లు పట్టణంలోని బెంచ్‌కొట్టాలకు చెందిన దివాకర్ బాబుకు తెలిసింది. సదరు యువతి కృష్ణారెడ్డితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సేకరించి, ఆమెను వేధించడం ప్రారంభించాడు. బలవంతంగా ఆమెను గుంతకల్లుకు పిలిపించుకుని, స్థానికంగా ఉండే ఓ లాడ్జ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ క్రమంలోనే మళ్లీ తెరపైకి వచ్చిన కృష్ణారెడ్డి.. దివాకర్‌తో సదరు యువతి కలిసి ఉన్న ఫొటోలను సంపాదించి, వాటిని సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టి బెదిరింపులకు దిగాడు.
నరకయాతన అనుభవించిన బాధితురాలు ఎట్టకేలకు తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకుంది. ‘దిశ’ యాప్ ద్వారా బాధను గ్రామ మహిళా పోలీసుకు విన్నవించింది. ఈ విషయం ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌కు తెలియడంతో సీరియస్‌గా పరిగణించారు. తక్షణమే కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని ‘దిశ’ పోలీసు స్టేషన్ డీఎస్పీ ఆంథోనప్పకు ఆదేశాలు చేశారు. ఈ విషయం తెలిసిన కృష్ణారెడ్డి, దివాకర్ బాబులు పరారయ్యేందుకు ప్లాన్ వేసుకున్నారు. శనివారం స్థానిక నగర శివారులోని నేషనల్ పార్కు వద్ద దాక్కుని ఉండగా, పక్కాగా అందించిన సమాచారం మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కటకటాల వెనక్కి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment