రైతులకు చుక్కలు
శింగనమల మండలం ఆకులేడు గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున ఖాతా నంబరు 1691లోని భూమిని చుక్కల భూములుగా నమోదు చేశారని ఆవేదన చెందారు. ఆల్ ఇండియా రేడియోలో ఈ నెల 7వ తేదీన నిర్వహించిన ‘అనంత మిత్ర ఫోన్ ఇన్’ కార్యక్రమానికి ఫోన్ చేసి తన సమస్యను నేరుగా కలెక్టర్ వినోద్‌కుమార్‌కే చెప్పుకున్నారు. ఒక మల్లికార్జునకే కాదు... జిల్లాలో చాలా మంది రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
అనంతపురం అర్బన్: రైతులకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ‘అన్నదాత సుఖీభవ’ కింద ప్రభుత్వం ప్రకటించిన రూ.20 వేల పెట్టుబడి సాయం అందక ఇబ్బంది పడుతున్నారు. ఉచిత పంటల బీమాను ప్రభుత్వం రద్దు చేయడంతో రైతులు తమ ప్రీమియం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక 2023 ఏడాదికి సంబంధించి బీమా మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే తాజాగా మరో కష్టం వచ్చిపడింది. ‘చుక్కల’ తిప్పలు మళ్లీ మొదలయ్యాయి.
నిలిచిన 220 ఫైళ్లు..
డీఎల్‌సీ (జిల్లా స్థాయి కమిటీ) సమావేశం నిర్వహించకపోవడంతో ‘చుక్కల’ భూములకు సంబంధించి దాదాపు 220 అర్జీలు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. రైతులకు మంచి చేయాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2003 కంటే ముందు అసైన్డ్ అయిన భూములకు యాజమాన్య హక్కులు కల్పించేలా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని అమలు చేసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం దీనిపై పరిశీలనకు ఆదేశించడంతో 22ఏ జాబితాలోని భూములు, చుక్కల భూములకు సంబంధించిన ఫైళ్ల పరిష్కారానికి బ్రేక్ పడింది. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు.
చుక్కల భూమి అంటే...
నిషేధిత భూములు (22ఏ), చుక్కల భూములు (డాటెడ్ ల్యాండ్) రెండు ఒకే రకం కాదు. వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. 1954, జూన్ 18 కంటే ముందు అసైన్డ్ చేసిన ప్రభుత్వ భూములు 22ఏ భూముల జాబితా కిందకు వస్తాయి. ఇక చుక్కల భూములు విషయానికి ప్రభుత్వ భూమిగా చెప్పే భూమి వివరం ఆర్‌ఎస్‌ఆర్ (రీ సెటిల్మెంట్ రిజిస్టర్)లో చుక్కలుగా చూపించి ఉండాలి. ఆ భూమి ఎవరికీ అసైన్డ్ చేసి ఉండకూడదు. ఇలాంటి భూమిని అనుభవించేవారు దరఖాస్తు చేసుకుంటే... నిబంధనల మేరకు ఉన్నవాటికి డీఎల్‌సీ సమావేశంలో నిర్ణయం తీసుకుని జాబితా నుంచి తొలగిస్తారు.
ఆమోదముద్రకు నిబంధనలిలా...
● చుక్కల భూముల జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమినిని సాగు చేస్తున్న వారికి నిబంధనల ప్రకారం డీఎల్‌సీ ఆమోద ముద్ర వేస్తుంది.
● సాగు చేస్తున్న ప్రభుత్వ భూమి వివరం ఆర్‌ఎస్‌ఆర్‌లో ‘చుక్కలు’గా ఉండాలి. ఆ భూమి ఎవరి పేరునా అసైన్డ్ చేసి ఉండకూడదు.
● డాటెడ్ ల్యాండ్ చట్టం–2107 ప్రకారం ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వ్యక్తి చట్టం వచ్చే నాటికి 12 ఏళ్ల ముందు ఆ భూమిపై హక్కు, అనుభవం కలిగి ఉండాలి.
● చట్టం నిబంధనల ప్రకారం సాగు చేస్తున్న వారు తహసీల్దారు వద్ద దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి ఆర్‌డీఓకు తహసీల్దారు నివేదిస్తారు. దానిని ఆర్‌డీఓ విచారణ చేసి కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు.
● ఇక్కడ జిల్లాస్థాయి కమిటీ వాటిని విచారణ చేసి నిబంధనల ప్రకారం అన్ని సక్రమంగా ఉన్నవాటికి జాబితా నుంచి తొలగిస్తూ అమోద ముద్ర వేస్తారు.
మంచి చేసేలా గత వైఎస్సార్ సీపీ సర్కారు చర్యలు
కూటమి సర్కారు వచ్చీరాగానే బ్రేకులు
ఫ్రీహోల్డ్ పరిశీలన పేరుతో అడ్డంకులు
డీఎల్‌సీ సమావేశం నిర్వహించని
అధికారులు
220 ఫైళ్లపై నిర్ణయం తీసుకోని
అధికారులు
కలెక్టర్‌కు తమ గోడు చెప్పుకుంటున్న రైతులు
త్వరలో చర్యలు చేపడతాం
అసైన్మెంట్ భూములకు సంబంధించి ఫ్రీహోల్డ్ పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. ఫ్రీహోల్డ్ భూములు, చుక్కల భూములు, వాటి రిజిస్ట్రషన్లు ఇలా ఒకదానితో ఒకదానికి సంబంధం ఉంది. ఈ కారణంగా డీఎల్‌సీ సమావేశం నిర్వహించలేదు. ఫ్రీహోల్డ్ పరిశీలన నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం. అటు తరువాత చుక్కల భూములకు సంబంధించి డీఎల్‌సీ సమావేశం నిర్వంచేందుకు త్వరలో చర్యలు చేపడతాం. – వి.వినోద్‌కుమార్, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment