ఆలయంలో చోరీ
కంబదూరు: మండలంలోని కదిరిదేవరపల్లిలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించిన దుండగులు సుమారు రూ.2 లక్షలు విలువ చేసే 9 వెండి గొడుగులు, 3 వెండి నాగ పడగలు, 6 వెండి కిరీటాలు, బంగారు తాళి బొట్టు గిన్నెలు, రూ.3 వేల నగదు అపహరించారు. ఆదివారం ఉదయం ఆలయంలో పూజాదికాలు చేసేందుకు వెళ్లిన అర్చకులు గమనించి సమాచారం ఇవ్వడంతో ఈఓ దేవదాసు, డీఎస్పీ రవిబాబు, సీఐ నీలకంఠేశ్వర, ఇన్‌చార్స్ ఎస్‌ఐ రాంభూపాల్ తదితరులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
చిన్నముష్టూరులో దొంగతనం
ఉరవకొండ: మండలంలోని చిన్నముష్టూరులో దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన రైతు సాంబశివ, చౌడమ్మ దంపతులు ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లారు. రాత్రి ఇంటికి చేరుకున్న వారు అప్పటికే తాళం బద్ధలుగొట్టి ఉండడం గమనించి లోపలకు వెళ్లి పరిశీలించారు. బీరువాలో భద్రపరిచిన 10 తులాల బంగారు నగలు, రూ.60వేలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం సాయంతో నిందితుల వేలిముద్రలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గుత్తిలో తుపాకీ కలకలం
గుత్తి: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని జెడ్.వీరారెడ్డి కాలనీలో ఆదివారం గన్ కలకలం రేపింది. కాలనీలో ఓ ఇంటి పక్కన పడి ఉన్న గన్ (పిస్టల్)ను స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. పిస్టల్ పురాతనమైందని, అందులో బుల్లెట్లు ఏమీ లేవని పోలీసులు తెలిపారు. పిస్టల్ ఎవరిదనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా మన ఊళ్లో గన్ కల్చర్ ఏమిటంటూ గుత్తి వాసులు చర్చించుకోవడం గమనార్హం.
కర్ణాటకలో ప్రమాదం...
ఉరవకొండ వాసి మృతి
ఉరవకొండ: కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకున్న ప్రమాదంలో ఉరవకొండకు చెందిన ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. వివరాలు... ఉరవకొండకు చెందిన సంజీవరెడ్డి కుమారుడు రామేశ్వరరెడ్డి (19) బెంగళూరులోని దయానంద సాగర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆటోలో తిరిగి వెళుతుండగా హోరువల్లి కనకపుర రోడ్డు సమీపంలో బస్సు ఢీకొంది. ప్రమాదంలో రామేశ్వరరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ఆటోలో ప్రయాణిస్తున్న స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో స్థిరపడుతాడనుకున్న కుమారుడు దుర్మరణం పాలవ్వడంతో తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా పోయింది.
ద్విచక్రవాహనాలు ఢీ –
వృద్ధుడి మృతి
బొమ్మనహాళ్: మండలంలోని శ్రీనివాసక్యాంప్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. వివరాలు.. దేవగిరి క్రాస్‌కు చెందిన కొండయ్య (75) ఆదివారం శ్రీనివాసక్యాంపు సమీపంలో పొలం పనులు చూసుకుని తన సూపర్ ఎక్స్‌ఎల్ వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. అదే సమయంలో బెంగళూరు నుంచి మంత్రాలయానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న గోవర్దన్ అనే వ్యక్తి ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన కొండయ్యను బళ్లారిలోని విమ్స్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన గోవర్దన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
క్వారీలో తేనెటీగల దాడి
వజ్రకరూరు: మండలంలోని కొనకొండ్ల సమీపంలోని ఓ క్వారీలో తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా గాయపడిన మస్తాన్, రామాంజినేయలును వెంటనే కొనకొండ్ల పీహెచ్‌సీలో చికిత్సలు అందజేసి, గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న మస్తాన్‌ను ఆదివారం ఉదయం అనంతపురానికి రెఫర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment