60 వేల హెక్టార్లకు ‘రబీ’
అనంతపురం అగ్రికల్చర్: రబీలో సాధారణ సాగు 1,18,330 హెక్టార్లుగా వ్యవసాయాధికారులు గుర్తించగా... తాజా నివేదిక ప్రకారం 51 శాతం విస్తీర్ణంతో 60 వేల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో ప్రధాన పంట పప్పుశనగ 72,909 హెక్టార్లకు గానూ 70 శాతంతో 50,776 హెక్టార్లలో సాగైంది. ఆలస్యంగా వేసిన పంట వివరాలు అందాల్సి ఉంది. ఈ లెక్కన పప్పుశనగ విస్తీర్ణం మరింత పెరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో వేరుశనగ, వరి నాట్లు వేస్తున్నందున ఈ రబీలో సాధారణ విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చే అవకాశముంది. వేరుశనగ సాగుకు డిసెంబర్ 15 వరకు అనువైన సమయంగా శాస్త్రవేత్తలు ప్రకటించారు.
27న విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు
అనంతపురం రూరల్: విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న మూగ, చెవిటి, శారీరక, మానసిక వికలాంగులు, అంధులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకుడు అబ్దుల్ రసూల్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 27న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో పోటీలు ఉంటాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతులు ఉదయం 9 గంటలకు హాజరై, పేర్లు నమోదు చేసుకోవాలి.
కుప్పకూలిన ఆర్టీసీ
ఆర్‌ఎం కార్యాలయ పైకప్పు
అనంతపురం క్రైం: ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయ పైకప్పులో ఓ భాగం కుప్పకూలింది. కాలం చెల్లిన భవనం కావడంతో రోజు వారీ పెచ్చులూడి పడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఉన్నఫళంగా కొద్ది భాగం కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కూలిన ప్రాంతంలో కార్యాలయ ఉద్యోగులు తమ వాహనాలను పార్కింగ్ చేస్తుంటారు. ఇక కార్యాలయం అంతర్భాగంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు కూలుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో నెలకొనడంతో ఉద్యోగులు భయంభయంగానే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోనే ఉన్న ఆర్‌ఎం కార్యాలయం పరిసరాల్లో నిత్యం రద్దీ ఉంటుంది. శిథిలావస్థకు చేరుకున్న కార్యాలయ చుట్టూ ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే జనం అటుగా వెళ్లే అవకాశం ఉండదని పలువురు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment