ఇంకుడు గుంత పరిశీలన
గార్లదిన్నె: ఉపాధి హామీ పథకంలో భాగంగా గార్లదిన్నె జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన వాటర్ హార్వెస్టింగ్ (ఇంకుడు గుంత) స్ట్రక్చర్‌ను కేంద్ర బృందం సభ్యులు అరులానందన్, షరీఫ్‌ఖాన్ గురువారం పరిశీలించారు. రూ.60 వేలు ఉపాధి హామీ పథకం నిధులతో ఇంకుడు గుంతను నిర్మించినట్లు ఈ సందర్భంగా వారికి ఏపీడీలు శైలజ, విజయ్‌కుమార్, సుధాకర్‌రెడ్డి వివరించారు. ఎంపీడీఓ యోగానందరెడ్డి, ఏపీఓ నాంచారమ్మ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎస్కేయూలో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బోధనేతర ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వివరాలు... ఎస్కేయూ పరీక్షల విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పి.లక్ష్మీనారాయణ 2016–17లో తండ్రి నారాయణ మరణానంతరం కారణ్య నియామకం కింద విధుల్లో చేరారు. బోధనేతర ఉద్యోగ సంఘం కార్యదర్శి పదవిలోనూ ఆయన కొనసాగుతున్నారు. ఈ క్రమంలో తనతో పాటు తనలాంటి వారికి పదోన్నతి కల్పించాలంటూ సంఘం తరఫున పలుమార్లు వర్సిటీ ఉన్నతాధికారులకు విన్నవించారు. అయినా ఫలితం దక్కలేదు. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలోనూ పదోన్నతుల అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గురువారం సాయంత్రం ఎస్కేయూ రిజిస్ట్రార్ చాంబర్‌లోకి దూసుకెళ్లి రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్‌బాబు ఎదుటనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన అక్కడున్న ఉద్యోగులు వెంటనే అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్ అక్కడకు చేరుకుని లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎస్సీ కేటగిరిలో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టులో తనకు పదోన్నతి కల్పించాలంటూ వేడుకున్నా అధికారులు స్పందించడ లేదంటూ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. రిజిస్ట్రార్ ఒంటెత్తు పోకడలతో విసుగు చెంది చివరకు చనిపోవాలని నిర్ణయించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఎస్సీల పట్ల ఎస్కేయూ రిజిస్ట్రార్ వైఖరి మారాలని ఎస్సీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
విషజ్వరంతో విద్యార్థి మృతి
రాయదుర్గం టౌన్: విషజ్వరం బారిన పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు.. కూలి పనులతో జీవనం సాగిస్తున్న రాయదుర్గం మండలం చదం గ్రామానికి చెందిన దేవేంద్రప్ప, గోవిందమ్మ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న చిన్నకుమారుడు చరణ్ (12) కొన్ని రోజుల క్రితం జ్వరం బారిన పడ్డాడు. చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో పది రోజుల క్రితం బళ్లారిలోని విమ్స్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స మొదలు పెట్టారు. రెండు రోజుల క్రితం రోగిలో జాండీస్ లక్షణాలు బయటపడ్డాయి. పరిస్థితి విషమిస్తుండడంతో బెంగళూరుకు రెఫర్ చేశారు. అయితే ఈ పదిరోజుల్లో కుమారుడి వైద్యం కోసం దాదాపు రూ.20 వేలకు పైగా ఖర్చు పెట్టిన నిరుపేద తల్లిదండ్రులు బెంగళూరుకు వెళ్లేందుకు డబ్బు సర్దుబాటు చేసుకునే క్రమంలో విమ్స్ నుంచి కుమారుడిని పిలుచుకుని వచ్చారు. రెండు రోజులుగా ఎంత ప్రయత్నించినా డబ్బు సర్దుబాటు కాలేదు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి గురువారం సాయంత్రం చరణ్ మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment