రెసిడెన్షియల్ శిక్షణలో ఇంకెందరిని బలి చేస్తారు?
అనంతపురం ఎడ్యుకేషన్: రెసిడెన్షియల్ పద్దతిలో శిక్షణ వద్దని మొత్తుకుంటున్నా కూటమి సర్కర్ పట్టించుకోవడం లేదని, ఈ శిక్షణ పేరుతో ఇంకా ఎంతమంది టీచర్లను బలికొంటారంటూ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు ప్రశ్నించారు. గురువారం స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాయల్ వెంకటేష్, ఎస్.సిరాజుద్దీన్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఎస్జీటీల రెసిడెన్షియల్ శిక్షణ వల్ల చాలామంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వయసు రీత్యా కొందరు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న మరికొందరు ఉపాధ్యాయులు, ముఖ్యంగా మహిళలు వందలాది కిలోమీటర్లు ప్రయాణించి శిక్షణకు రావడం, సుదీర్ఘంగా 10 నుంచి 12 గంటల పాటు శిక్షణలో కూర్చోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ ఒత్తిడి తాళలేక ఇటీవల ఓ ప్రధానోపాధ్యాయుడు మరణించాడని, తాజాగా విజయనగరం జిల్లాలో మరో ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందాడం బాధాకరమన్నారు. ఈ ఉపాధ్యాయుల మరణానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే శిక్షణ కార్యక్రమాలను మూకుమ్మడిగా బహిష్కరిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్, రాష్ట్ర కౌన్సిలర్లు సర్దార్‌వలి, వెంకటరమణ, ఆడిట్ కమిటీ కన్వీనర్ వన్నప్ప, జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, హిమగిరి ప్రసాద్, తిప్పేస్వామి, రామమూర్తి, సుహేల్, బాబ్జాన్, కలీముల్లా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment