బధిరుల క్రికెట్ టోర్నీ విజేత ఒడిశా
అనంతపురం: బధిరుల అండర్–19 జాతీయ క్రికెట్ చాంపియన్‌షిప్ (ఐడీసీఏ)ను ఒడిశా జట్టు కై వసం చేసుకుంది. అనంత క్రీడాగ్రామం వేదికగా ఆర్డీటీ స్టేడియంలో గురువారం డెఫ్ ఒడిశా, డెఫ్ హర్యానా మధ్య ఫైనల్ పోటీ హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన డెఫ్ ఒడిశా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. జట్టులో సనిత్‌శెట్టి 42 పరుగులతో రాణించాడు. అనంతరం బరిలో దిగిన డెఫ్ హర్యానా జట్టు 17.4 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. 40 పరుగుల తేడాతో ఒడిశా జట్టు గెలుపొందింది. సిరీస్ బెస్ట్ బ్యాటర్‌గా ఆర్వేటి లోకేష్ 126 పరుగులు, బెస్ట్‌బౌలర్‌గా పి. విజయ భాస్కర్ (ఏపీ – 12 వికెట్లు), మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సనిత్‌శెట్టి (ఒడిశా – 116 పరుగులు, 8 వికెట్లు, రెండు క్యాచ్‌లు) నిలిచారు. విజేతలను అభినందిస్తూ ట్రోఫీలను ఐడీసీఏ సెక్రెటరీ అజయ్, స్పోర్ట్స్ అకాడమీ మేనేజర్ శ్రీదేవి, డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కె.గోపీనాథ్, సత్యనారాయణరెడ్డి, తదితరులు అందించారు.
బాల్య వివాహం... ఆరుగురిపై కేసు నమోదు
యాడికి: మైనర్ బాలికకు వివాహం చేసిన ఘటనలో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఈరన్న, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయకుమారి తెలిపిన మేరకు... తాడిపత్రి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక (14)కు యాడికికి చెందిన ఓ యువకుడి(21)తో ఇరువైపులా కుటుంబసభ్యులు 2022, ఏప్రిల్ 21న కమలపాడు పంచాయతీ పరిధిలోని కొత్త వెంకటరమణ స్వామి ఆలయంలో పెళ్లి జరిపించారు. రెండేళ్లు తిరక్కుండానే ఇద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో తన చెల్లెలు జీవితాన్ని చక్కదిద్దాలంటూ బాలిక సోదరుడు గుత్తి కోర్టును ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న న్యాయమూర్తి... పోలీసులు, ఐసీడీఎస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఫిర్యాదు మేరకు సీఐ ఈరన్న విచారణ చేపట్టి పెళ్లి చేసుకున్న యువకుడితో పాటు ఆయన తల్లిదండ్రులు, బాలిక తల్లిదండ్రులు, సోదరుడిపై కేసు నమోదు చేశారు.
వివాహిత ఆత్మహత్య
బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన వివాహిత ఎరికల రాధ (23) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కర్నూలు జిల్లా పెద్దకడుబూరుకు చెందిన సిద్దమ్మ కుమారై రాధకు నాలుగేళ్ల క్రితం ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన ఎరికల శరణప్పతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు , కుమారై ఉన్నారు. గురువారం పుట్టింటికి వెళాతనంటూ రాధ అనడంతో భర్త వారించాడు. ప్రతిసారీ పుట్టింటికి వెళతాననడం మంచిది కాదనడంతో క్షణికావేశానికి లోనై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, తమ కుమార్తెను భర్త, ఆడపడచు, అత్త తరచూ కొట్టేవారని, వారి వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ మృతురాలి తల్లి సిద్ధమ్మ, బంధువులు ఆరోపించారు. సిద్ధమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment