నిర్లక్ష్యం ఖరీదు రూ.23 లక్షలు!
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచిన ఉదంతం వెలుగు చూసింది. కేవలం అధికారుల అలసత్వం కారణంగా రూ.23 లక్షల నిధులు వెనక్కుపోయాయి. ఇప్పుడానిధుల గురించి పట్టంచుకునే నాథుడే కరువయ్యారు.
విద్యాప్రమాణాల స్థాయిని గుర్తించేందుకు
ఎన్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 3, 6, 9 తరగుతల విద్యార్థులకు 2023 నవంబరులో ‘స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్‌మెంట్ సర్వే’ (సీస్) పరీక్ష నిర్వహించారు. తెలుగు, గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో విద్యాప్రమాణాల స్థాయిని గుర్తించేందుకు ఈ సర్వే దోహదపడుతుంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో 1,234 స్కూళ్లలో ఈ పరీక్ష నిర్వహించారు. 3, 6, 9 తరగతులకు చెందిన దాదాపు 32 వేల మంది విద్యార్థులతో జిల్లా సాధారణ పరీక్ష మండలి (డీసీఈబీ) ఆధ్వర్యంలో పరీక్ష రాయించారు. ప్రశ్నపత్రాల రవాణాతో పాటు విధుల్లో పాల్గొన్న ఎంఈఓలు, సీఆర్పీలకు రెమ్యూనరేషన్ చెల్లింపులకు ఎస్‌సీఈఆర్‌టీ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుంది. దీంతో మండలాల్లో నిర్వహణ బాధ్యతలను మొత్తం ఎంఈఓలే చూసుకున్నారు. ఇందుకోసం ముందస్తుగా వారు సొంతంగా ఖర్చు చేసి తర్వాత బిల్లులు పెట్టారు.
రూ. 23 లక్షల నిధుల మంజూరు
‘సీస్’ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఈ ఏడాది మార్చి రెండోవారంలో ఎస్‌సీఈఆర్టీ నుంచి నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రశిక్ష కార్యాలయాలకు మంజూరు చేసి అక్కడి నుంచి డీసీఈబీ ఖాతాలకు డ్రా చేసుకోవాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న బిల్లులను రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల అధికారులు సబ్‌మిట్ చేసి నిధులు డ్రా చేసి, సద్వినియోగం చేసుకున్నారు. ఒక్క ‘అనంత’ జిల్లాలో మాత్రం అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా సకాలంలో నిధులు డ్రా చేయకపోవడంతో అవి కాస్త వెనక్కు మళ్లాయి.
డీసీఈబీ నిధులు వాడుకుని...
‘సీస్’ పరీక్ష నిర్వహణకు డిగ్రీ విద్యార్థులను ఇన్విజిలేటర్లుగా నియమించారు. వీరికి మాత్రం రెమ్యూనరేషన్ చెల్లించేలా డీఈసీబీ ఖాతాలో నుంచి దాదాపు రూ.8 లక్షల నిధులు వాడుకునేలా కలెక్టర్ అనుమతులిచ్చారు. అయితే బిల్లులు మంజూరు కాగానే ఆ రూ.8 లక్షలు డీసీఈబీ ఖాతాలో జమ చేయాల్సి ఉంది. ఇక ఎంఈఓలు, సీఆర్పీల రెమ్యూనరేషన్‌తో పాటు ప్రశ్నపత్రాల తరలింపు, ప్యాకింగ్ ఇతర ఖర్చులు మొత్తం కలిపి దాదాపు రూ.15 లక్షలను అధికారులు, ఎంఈఓలే భరించారు. తొమ్మిది నెలలుగా ఎదురు చూస్తున్నా... ఖర్చు పెట్టిన డబ్బు వెనక్కు రాలేదు. దీనికి తోడు నిధులు వెనక్కు పోవడంతో డీఈసీబీ ఖజనాలో రూ.8 లక్షల లోటు అలాగే ఉండిపోయింది.
విద్యాశాఖ అధికారుల అలసత్వం బట్టబయలు
2023 నవంబర్‌లో 3, 6, 9 తరగతుల విద్యార్థులకు ‘సీస్’ పరీక్ష
2024 మార్చి 12న నిర్వహణ నిధులు విడుదల
రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లో నిధుల సద్వినియోగం
నిర్లక్ష్యం కారణంగా అనంతపురం జిల్లాలో వెనక్కు మళ్లిన నిధులు
సంతకం పెట్టని వరలక్ష్మి
సమగ్రశిక్ష ఖాతాల్లో డబ్బులు జమకాగానే వెంటనే డీఈసీబీ కార్యదర్శికి సమాచారం అందించారు. ఆయన వెళ్లి సమగ్రశిక్ష అధికారులతో మాట్లాడి ఫైలు సిద్ధం చేయించి ఆమోదం కోసం అప్పటి డీపీసీ (డీఈఓ) వద్దకు పంపారు. అయితే అప్పటి డీఈఓ వరలక్ష్మి అనుమానాలు వ్యక్తం చేస్తూ ‘చూద్దాం..ఆగండి’ అంటూ ఆ ఫైల్‌ను పక్కన పెట్టేశారు. కొద్దిరోజుల తర్వాత ‘సీస్’ పరీక్ష నిర్వహణ కమిటీ సభ్యులందరీ సంతకాలు ఉండాలని చెప్పడంతో ఆ మేరకు అందరూ సంతకాలు పెట్టి ఇచ్చారు. అయినా డీఈఓ సంతకం చేయకుండా కొర్రీ వేస్తూ వచ్చారు. చివరకు ఈ ఏడాది మార్చి 31న రాత్రి ఆ నిధులను ఎస్‌సీఈఆర్టీ అధికారులు వెనక్కు తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర అధికారులతో మాట్లాడి ఆ నిధులు తిరిగి తెప్పించే ప్రయత్నాన్ని విద్యాశాఖ అధికారులు అటకెక్కించారు.
నాకేమీ తెలీదు.. కొత్తగా వచ్చా
నేను కొత్తగా వచ్చాను. ‘సీస్’ పరీక్ష నిర్వహణ నిధులు వెనక్కు మళ్లిన సంగతి నాకు తెలీదు. డీసీఈబీ కార్యదర్శితో మాట్లాడుతా. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు తెప్పించే ప్రయత్నం చేస్తా. – ప్రసాద్‌బాబు, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment