ప్రభుత్వ మెడలు వంచుదాం
అనంతపురం కార్పొరేషన్: ‘‘పంట నష్టపోయిన రైతులను ఆదుకోకుండా, మద్దతు ధర కల్పించకుండా రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం ఏడిపిస్తోంది. ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’, ‘నిరుద్యోగ భృతి’, ‘ఉచిత సిలిండర్లు’, ‘ఫ్రీ బస్సు’ అంటూ ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వ మెడలు వంచేందుకు ప్రజలు సన్నద్ధమవ్వాలి’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరికి ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేదని విమర్శించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండలాల్లో 17 మండలాల్లోనే కరువు ఉన్నట్లు తప్పుడు నివేదికలు రూపొందించారని దుయ్యబట్టారు. అనంతపురం జిల్లాలోని ఏడు మండలాల్లో రూ.17.60 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.25 కోట్లు మాత్రమే నష్టం వాటిల్లినట్లు లెక్కగట్టి అన్యాయం చేశారని వాపోయారు. హంద్రీనీవా సామర్థ్యాన్ని 6,200 క్యూసెక్కులకు పెంచితేనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందని, కానీ ఈ ప్రభుత్వం 3,500 క్యూసెక్కులకే పరిమితం చేయడం అన్యాయమన్నారు.
రైతులకు దగా..
పంటలకు మద్దతు ధర అని ప్రకటించినా.. ఇంత వరకు ఎక్కడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని అనంత మండిపడ్డారు. వరి సాధారణ రకం క్వింటాల్ మద్దతు ధర రూ.2,300, ఏ గ్రేడ్ రకం రూ.2,320 అని ప్రకటించి మాటలకే పరిమితమయ్యారని, ప్రస్తుతం రూ.1,950 నుంచి రూ.2,050కు అమ్ముకునే పరిస్థితి ఉందన్నారు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2,225 అని ప్రకటించారని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొక్కజొన్న క్వింటాల్ రూ.3 వేలు పలికిందని గుర్తు చేశారు. వేరుశనగ రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందన్నారు. క్వింటాల్ ధర రూ.6,783గా ప్రకటించినా బస్తా కేవలం రూ.1,800కే అమ్ముకుంటున్నారన్నారు. అరటి పంట రైతులకు గతేడాది తొలి కొయ్య రూ.25 వేల నుంచి రూ.28 వేలు ఉంటే ఈ ఏడాది కేవలం రూ. 17 వేల నుంచి రూ.19 వేలు, రెండో కొయ్య గతంలో రూ.19 వేల నుంచి రూ.20వేలు ఉంటే.. ఈ ఏడాది రూ.12 వేల నుంచి రూ.13 వేలు మాత్రమే పలుకుతోందన్నారు.
అండగా నిలిచిన జగనన్న..
గత ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500ను మూడు విడతల్లో రైతులకు అందజేశారన్నారు. ఏకంగా రూ.1,900 కోట్లు అందించి ఆదుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20,000 ఇస్తామని మాట తప్పారని మండిపడ్డారు.
ప్రగల్భాల మంత్రి నాదెండ్ల..
రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తామని సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రగల్భాలు పలికారని, క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటి వరకు కేవలం 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని ఆయన వివరించారు. ఆయిల్‌ఫెడ్ ద్వారా అరటిని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా, పదేళ్ల క్రితమే ఆయిల్‌ఫెడ్‌ను మూసేశారన్నారు. జిల్లాలో ఎరువుల వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తున్నా కలెక్టర్, అధికారులకు కన్పించడం లేదా అని ప్రశ్నించారు.
వారిపై పీడీ యాక్ట్ పెట్టరా?
ఇసుక, మద్యం, బూడిద అమ్మకాల దోపిడీలో తేడాలు వచ్చి ఎమ్మెల్యేలు గొడవలకు దిగుతున్న దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. వారిపై పీడీ యాక్ట్ పెట్టేలా సీఎం చర్యలు తీసుకోలేరా? అని ప్రశ్నించారు. రాయలసీమ థర్మల్ పవర్‌లో ఫ్లైయాష్‌ను ప్రభుత్వమే విక్రయించి ఆదాయం పెంచుకోవచ్చని సూచించారు. ఇప్పటికై నా మేలుకోకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టదా?
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment