ఆధునిక యుగ పురుషుడు పూలే
అనంతపురం సిటీ: ఆధునిక భారతీయ సమాజాన్ని సంస్కరించడానికి, కుల నిర్మూలన కోసం మొట్టమొదట కృషి చేసిన యుగ పురుషుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి పూలే వర్ధంతి కార్యక్రమానికి మంత్రి కేశవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, శింగనమల, అనంతపురం, రాయదుర్గం ఎమ్మెల్యేలు బండారు శ్రావణిశ్రీ, దగ్గుబాటి ప్రసాద్, కాలవ శ్రీనివాసులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, వైస్ చైర్‌పర్సన్ నాగరత్నమ్మ, నగరపాలక సంస్థ మేయర్ మహమ్మద్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, డీఆర్‌ఓ మలోల పాల్గొన్నారు. ముందుగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం విలేకర్లతో మంత్రి మాట్లాడుతూ సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి మహాత్మా జ్యోతిబాపూలే సమాజంలో మార్పునకు శ్రీకారం చుట్టి మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని, ఆశయ సాధన కోసం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, శ్రావణి శ్రీ, దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో అంతరాలు తొలగించేందుకు తొలిసారి ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
Comments
Please login to add a commentAdd a comment