విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
అనంతపురం కార్పొరేషన్: విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్ సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం అనంతపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యారంగానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. విద్యతోనే పేదల ఉన్నతి అని భావించిన జగనన్న రూ.73 వేల కోట్లతో విద్యారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో పేద విద్యార్థులను ఆదుకున్నారన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ వర్తింపజేస్తామని చెప్పారని, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా, వసతి దీవెన, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి తదితర హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా నేటికీ పట్టించుకోవడం లేదన్నారు. తల్లికి వందనం పథకానికి రూ.12,500 కోట్లు అవసరమైతే, బడ్జెట్‌లో అరకొరగా నిధులు కేటాయించి తల్లిదండ్రులను మోసం చేశారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయడంతో పాటు విద్యా, వసతి దీవెన పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలకు ఇంత వరకూ విద్యా సామగ్రి ఇవ్వకపోవడం దారుణమన్నారు. హాల్‌టికెట్లు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామంటూ కాలేజీల యాజమాన్యాలకు కలెక్టర్ల ద్వారా కూటమి ప్రభుత్వం హెచ్చరికలు చేయిస్తోందని, బకాయిలు చెల్లించకుండా ఇలా దిగుజారుడు చర్యలకు దిగడం శోచనీయమన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలోని 18 యూనివర్సిటీలను ఇన్‌చార్జ్‌లతో నడిపిస్తున్నారంటే విద్యార్థుల పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నాయని, ఇప్పటికై నా మేలు కుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని విశ్వ హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ నేత
విశ్వేశ్వర రెడ్డి ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment