ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
బొమ్మనహాళ్: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పరిశీలించారు. మండలంలోని నేమకల్లు గ్రామంలో ఈ నెల 30న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. అనంతరం గ్రామసభలో ముఖాముఖి మాట్లాడతారు. ఈ క్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం చేతుల మీదుగా పింఛన్లు అందుకోనున్న లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీవో వసంతబాబు, డీఎస్పీ రవిబాబు, తహసీల్దార్ మునివేలు, ప్రత్యేకాధికారి తిప్పేస్వామి, ఎంపీడీఓ దాస్‌నాయక్, ఈఓపీఆర్‌డీ దాస్, సీఐలు వెంకటరమణ, జయనాయక్, ఎస్‌ఐలు నబీరసూల్, నాగమధు, గురుప్రసాద్‌రెడ్డి, సర్వేయర్ రవితేజ పాల్గొన్నారు.
24 గంటలు..
3,632 కేసులు!
● రోడ్డు భద్రత నిబంధనల ఉల్లంఘనులపై చర్యలు
● ఎంవీ యాక్ట్ కింద కేసుల నమోదు
● రూ.7,99,750 జరిమానా విధింపు
అనంతపురం క్రైం: రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎస్పీ జగదీష్ ఆదేశాలతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. గడచిన 24 గంటల వ్యవధిలో నిబంధనలు ఉల్లంఘించిన 3,632 మందిపై మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, రూ.7,99,750 జరిమానా విధించారు. అలాగే మట్కా, పేకాట, ఆరుబయలు ప్రాంతాల్లో మద్యం సేవించే వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని, కుర్రకారు వాహనాలను ఇష్టారాజ్యంగా నడిపితే చర్యలు తప్పవని ఎస్పీ జగదీష్ బుధవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. రేసింగ్ పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న యువతపై నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రమాదాల నియంత్రణకు పోలీసులు చేపట్టిన చర్యలకు జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.
సబ్సిడీతో డ్రిప్ పరికరాల
మంజూరు ●
● ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్‌ఖాన్
బెళుగుప్ప: సబ్సిడీతో అందజేసే డ్రిప్ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్‌ఖాన్ సూచించారు. బెళుగుప్ప మండలం నర్సాపురం, నక్కలపల్లి, శ్రీరంగపురం, గంగవరం గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి, రైతులతో మాట్లాడారు. బిందు, తుంపర సేద్యం పరికరాలను ప్రభుత్వం సబ్సిడీతో అందజేస్తోందన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 40,948 మంది రైతులు 56,867 హెక్టార్ల విస్తీర్ణంలో సూక్ష్మ సేద్యం పరికరాల ఏర్పాటుకు 451 రైతు సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. వీరిలో 4,784 మంది రైతులకు 5,641 హెక్టార్లకు సంబంధించి కలెక్టర్ పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రైతు వాటా చెల్లించిన వారందరికీ డ్రిప్ పరికరాలను అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నెటాఫెమ్ స్కిప్పర్‌కు చెందిన డీసీఓలు, ఆర్‌ఎస్‌కే సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment