సౌకర్యాలున్నా ఫలితాలు ఎందుకిలా?
అనంతపురం ఎడ్యుకేషన్: ‘40–50 ఏళ్ల నాటి ప్రభుత్వ బడులు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వ స్కూళ్లలో క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. సౌకర్యాలు కూడా బెస్ట్‌గానే ఉన్నాయి. మరి ఫలితాలు ఎందుకు మెరుగ్గా ఉండటం లేదు’ అని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ప్రశ్నించారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన అనంతపురం రూరల్ పరిధిలోని సీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల నుంచి ఎంపిక చేసిన ఎంఈఓలు, హెచ్‌ఎంలకు జరగుతున్న ‘లీడర్‌షిప్’ శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేకుల షెడ్లలో నడుపుతున్న ప్రైవేట్ స్కూళ్లకు వేలాది రూపాయల ఫీజులు కట్టి పిల్లలను పంపుతున్నారన్నారు. నాయకత్వ లోపాలతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్నది వివిధ సర్వేల్లో తేలిందన్నారు. దీంతో శిక్షణ అనేది దేశ వ్యాప్తంగా తప్పనిసరి చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలలంటే తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సి ఉందన్నారు. లేదంటే ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. విద్యా వ్యవస్థలో ప్రస్తుతం దాదాపు 45 యాప్‌లు ఉన్నాయని, అన్నీ కలిపి ఒకట్రెండ్ యాప్‌లు చేసేలా చూస్తున్నామని చెప్పారు. ఈ రెండు యాప్‌లలోనే అన్ని అంశాలూ ఉంటాయన్నారు. 8వ తరగతి పిల్లాడు 3వ తరగతి గణితాలు చేయకపోవడం బాధాకరమన్నారు.రానున్న డీఎస్సీ తో టీచర్ల కొరత ఉండదని, ఇక కావాల్సిందంతా నాణ్యమైన విద్య అని అన్నారు. సొంత పిల్లల్లా చూసుకున్నప్పుడే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల అకడమిక్ ప్రోగ్రెస్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా పని చేయాలన్నారు. ఒక్క విద్యార్థి ఫెయిల్ అయినా ఉపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాల పిల్లలు చదువుకునే భవిత కేంద్రాలపైనా దృష్టి పెడతామని చెప్పారు.
‘అనంత’ అంటే ప్రత్యేక మమకారం
అనంతపురం జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన మమకారం అని కోన శశిధర్ అన్నారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేసినా ఎందుకో ఈ జిల్లా అంటే ప్రత్యేక అభిమానం ఉందన్నారు. కలెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో చదువులు చెప్పాలన్నారు. సమావేశంలో పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్, డీఈఓ ప్రసాద్‌బాబు, ఆర్‌ఐఓ వెంకటరమణనాయక్, సమగ్రశిక్ష ఏపీసీ నాగరాజు, ఏఎంఓ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఓ నాగరాజు, సీఎంఓ గోపాలకృష్ణ పాల్గొన్నారు.
తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు
అనంతపురం అర్బన్: ఉపాధ్యాయ హాజరులో జిల్లా వెనుకబడి ఉందని, మెరుగుపడకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో కలెక్టర్ వి.వినోద్‌కుమార్‌తో కలిసి విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల్లో హాజరు సంతృప్తికరంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. రోజూ పర్యవేక్షించాలని డీఈఓని ఆదేశించారు. ఎఫ్‌ఏ–1 ఎంట్రీని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎఫ్‌ఏ– 2 ఎంట్రీల పెండింగ్ ఎక్కువగా ఉందని చెబుతూ, త్వరగా పూర్తి చేయాలని ఎంఈఓలను ఆదేశించారు. అపార్ అప్‌డేషన్‌తో పాటు విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ జిల్లా రోల్ మోడల్‌గా నిలవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) తయారు చేయాలని చెప్పారు. ఆర్భాటాలకు పోకుండా ఆహ్లాద వాతావరణంలో మెగా పేరెంట్స్ ఉపాధ్యాయుల సమావేశాలను నిర్వహించాలన్నారు. ఫ్లెక్సీలు, స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయవద్దని సూచించారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల్లో ఒకరు ఉండేలా గూగుల్ షీట్‌లో వారి పేరు, ఫోన్ నంబర్ నమోదు చేయాలని చెప్పారు. ఆర్‌జేడీ శామ్యూల్, తదితరులున్నారు.
విద్యార్థులు ప్రభుత్వ బడులకు ఎందుకు రావడం లేదో ఆలోచించాలి
పిల్లలకు అర్థమయ్యేలా బోధించాల్సిన బాధ్యత టీచర్లదే
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
కోన శశిధర్
Comments
Please login to add a commentAdd a comment