వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయండి
అనంతపురం అగ్రికల్చర్: వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా పశువులు, జీవాల్లో అంటు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, పశుసంవర్ధక శాఖ అధికారులను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.ఎం.నాయక్ ఆదేశించారు. బుధవారం ఆయన గుంటూరు నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డీవార్మింగ్, పీపీఆర్, చిటుకురోగం, బ్లూటంగ్, గిట్టపుండ్ల వ్యాధి, బ్రూసెల్లోసీస్, అంత్రాక్స్, దమ్మురోగం, జబ్బవాపు, చొప్పవాపు, ముద్దచర్మవ్యాధి (ఎల్‌ఎస్‌డీ) లాంటి ప్రాణాంతక, ప్రమాదకర వ్యాధులు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా షెడ్యూల్ ప్రకారం ఉచిత వ్యాక్సిన్ అందజేత కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అనుమానిత ప్రాంతాలు, గతంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలిన ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఉంచాలన్నారు. అలాగే సెక్స్ సార్టెడ్ సెమన్ (ఎస్‌ఎస్‌ఎస్) ద్వారా లక్ష్యం మేరకు 90 శాతం పెయ్యదూడలు జన్మించేలా గర్భోత్పత్తి కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. ఇటీవల మంజూరు చేసిన గోకులం షెడ్లు నిర్మాణాల పురోగతిపై ఆరాతీశారు, పశుగణన కార్యక్రమం ద్వారా కచ్చితమైన గణాంకాలు నమోదు చేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో పశుశాఖ జేడీ డాక్టర్ జీపీ వెంకటస్వామి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) డీడీ డాక్టర్ టి.సుధాకర్, డివిజన్ డీడీలు డాక్టర్ వై.రమేష్‌రెడ్డి, డాక్టర్ జి.వెంకటేష్, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (ఏడీడీఎల్) ఏడీ డాక్టర్ ఎన్.రామచంద్ర, జేడీ కార్యాలయ ఏడీలు డాక్టర్ రాధిక, డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి, డాక్టర్ ప్రమీలారాణి, మేనేజర్ మంజుల, వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీసీలో పశుశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
ఎంఎం నాయక్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment