రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
గుంతకల్లు: ఈ నెల 30 నుంచి విజయవాడలో ప్రారంభమయ్యే రాష్ట్ర స్థాయి ఓపెన్ సైక్లింగ్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే జిల్లా క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమశేఖర్, కార్యదర్శి పాండురంగ, సైక్లింగ్ సీనియర్ క్రీడాకారుడు వి.మల్లికార్జున బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అండర్–14, 18, 23 విభాగాల్లో పోటీలు ఉంటాయని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 29వ తేదీలోపు కోచ్ భాస్కర్ (62815 14399)ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలి.
చిరుత దాడిలో దూడ మృతి
కళ్యాణదుర్గం రూరల్: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి సమీపంలో రైతు తిమ్మరాజు తన ఇంటి ఆవరణలో కట్టి ఉంచిన ఆవు దూడను బుధవారం తెల్లవారుజామున ఓ చిరుత లాక్కెళ్లి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనతో రూ.20వేలు నష్టపోయినట్లు బాధిత రైతు తిమ్మరాజు వాపోయాడు.
వెదురు సాగుకు ప్రోత్సాహం
● హెక్టారుకు రూ.50 వేల రాయితీ
● ఒక్కో రైతుకు గరిష్టంగా ఐదు హెక్టార్లకు అనుమతి
● ఉద్యానశాఖ డీడీ నరసింహారావు వెల్లడి
అనంతపురం అగ్రికల్చర్: ఆకుపచ్చ బంగారంగా పిలిచే వెదురు సాగు (బ్యాంబూ)కు ముందుకు వస్తే ప్రత్యేక రాయితీలతో ప్రోత్సహిస్తున్నట్లు రైతులకు ఉద్యానశాఖ డీడీ బీఎంవీ నరసింహారావు సూచించారు. గృహ నిర్మాణం, రకరకాల ఫర్నీచర్ తయారీ, కాగితం, వస్రాల తయారీ, ఔషధాలు, ఆహార ఉత్పత్తులు, కళాత్మక వస్తువుల తయారీలో వెదురును విరివిగా వాడుతున్నారన్నారు. ఈ క్రమంలో బాంబ్యూ మిషన్ ప్రాజెక్టులో భాగంగా వెదురు సాగును బ్లాక్ ప్లాంటేషన్ కింద ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇప్పటికే రాయదుర్గం ప్రాంతంలో కొందరు రైతులు సాగుకు ముందుకు వచ్చారన్నారు. విస్తీర్ణం పెరిగితే మార్కెటింగ్‌కు ఇబ్బంది లేకుండా జిల్లాలోనే ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయవచ్చునని, ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చే రైతులకు రాయితీ కూడా చెల్లిస్తామని తెలిపారు. సాగు చేసిన ఏడాదికే పంట కోత మొదలవుతుందన్నారు. గుంతలు, మొక్కలు, ఊత కర్రలు, అంతర్‌కృషి, కలుపు నివారణ, నీటి నిర్వహణకు హెక్టారుకు రూ.50 వేలు చొప్పున రాయితీతో గరిష్టంగా ఒక్కో రైతుకు ఐదు హెక్టార్లకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఇందులో మొదటి ఏడాది రూ.25 వేలు, రెండో ఏడాది రూ.15 వేలు, మూడో ఏడాది రూ.10 వేల ప్రకారం రాయితీ చెల్లింపులు ఉంటాయన్నారు. పూర్తీ స్థాయి పంటగా అయితే మొక్కలు, వరుసల మధ్య 5 మీటర్లు దూరం ఉండేలా ఎకరాకు 160 మొక్కలు నాటుకోవాలన్నారు. అదే గట్ల వెంబడి అయితే రెండు మీటర్ల దూరంలో నాటుకుంటే సరిపోతుందన్నారు. వెదురుసాగుకు ముందుకు వచ్చే రైతులకు రాయితీలు ఉన్నందున ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment