అప్పటికప్పుడు కేంద్రం మార్పు.. | - | Sakshi
Sakshi News home page

అప్పటికప్పుడు కేంద్రం మార్పు..

Published Thu, Nov 28 2024 1:13 AM | Last Updated on Thu, Nov 28 2024 1:13 AM

అప్పట

అప్పటికప్పుడు కేంద్రం మార్పు..

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురంలో కొన్నాళ్లుగా ఆన్‌లైన్‌ విధానంలో ప్రశ్నపత్రాలు పంపుతున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే గంట ముందు ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం అప్‌లోడ్‌ చేస్తారు. ఎన్‌క్రిప్టెడ్‌ పాస్‌వర్డ్‌ సాయంతో వర్సిటీ అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు వాటిని డౌన్‌లోడ్‌ చేసి విద్యార్థులకు అందజేస్తారు. పేపర్‌ లీక్‌ను అరికట్టాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు.

ఒకటికి బదులు.. మరొకటి..

ప్రస్తుతం వర్సిటీ పరిధిలో బీటెక్‌ రెండు, మూడు సంవత్సరాల మొదటి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల విభాగం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం పంపే విషయంలో గత శనివారం తీవ్ర తప్పిదం చోటుచేసుకుంది. ఆ రోజు జరగాల్సిన సబ్జెక్టు ప్రశ్నపత్రం పంపకుండా సోమవారం నిర్వహించాల్సిన పరీక్ష ప్రశ్న పత్రం పంపారు. అది కూడా గంట ముందు కాకుండా ఒక రోజు ముందే పంపడం గమనార్హం. దీన్ని డౌన్‌లోడ్‌ చేసిన ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు నివ్వెరపోయారు. వెంటనే వర్సిటీ పరీక్షల విభాగం అధికారులకు సమాచారం ఇవ్వడంతో తేరుకున్న వారు హడావుడిగా అప్పటికప్పుడు మరో ప్రశ్నపత్రం పంపారు. దీన్ని బట్టి సదరు విభాగం అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి.

జంబ్లింగ్‌లోనూ తికమక..

విద్యార్థులకు పరీక్ష కేంద్రాల జంబ్లింగ్‌ అంశంపైనా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వర్సిటీ పరిధిలో 2013లో జంబ్లింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీన్ని అనుసరించి ఒక కళాశాల విద్యార్థులను రెండు, మూడు కళాశాలలకు కేటాయిస్తారు. అయితే, ఒకే విద్యార్థికి రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలకు వేర్వేరు కేంద్రాలను కేటాయిస్తున్నారు. రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలకు మధ్య కేవలం ఒక గంట సమయం ఉంటుంది. ఈ క్రమంలో రెగ్యులర్‌ పరీక్ష రాసి, 30 కిలోమీటర్ల దూరంలో ఉండే వేరే కళాశాలకు ఒక గంటలో చేరుకుని పరీక్ష ఎలా రాయాలని విద్యార్థులు వాపోతున్నారు. ఇక.. డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ అధికారులను మార్చి దాదాపు 5 నెలలు అవుతోంది. అయినప్పటికీ పాత వారు సంతకాలు చేసిన జవాబు పత్రాలనే నేటికీ వినియోగిస్తుండటం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది.

రాయచోటిలో రెండు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఇటీవల ఒక కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే, కేటాయించిన కళాళాల పేరు కాకుండా వేరే సెంటర్‌ పేరును హాల్‌టికెట్లలో ముద్రించడం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. దీనిపై విద్యార్థులు ఆందోళన చెందగా, అప్పటికప్పుడు మరో కళాశాలకు పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. ప్రశ్నపత్రం పంపడం మొదలు కేంద్రాల కేటాయింపు వరకూ వైఫల్యం చెందుతున్నా వర్సిటీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికై నా పరీక్షల విభాగాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా చూడాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేస్తున్నాం

పరీక్షల విభాగానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ విధానంలో ప్రశ్నపత్రాలు పంపడంలో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నాం. ఇందులో కొన్ని లోటుపాట్లు జరిగాయి. అప్‌డేట్‌ అయ్యాక ప్రస్తుతం అంతా సవ్యంగానే పంపుతున్నాం.

– శివకుమార్‌, కంట్రోలర్‌ ఆఫ్‌

ఎగ్జామినేషన్స్‌, జేఎన్‌టీయూ

No comments yet. Be the first to comment!
Add a comment
అప్పటికప్పుడు కేంద్రం మార్పు.. 1
1/1

అప్పటికప్పుడు కేంద్రం మార్పు..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement