తెగుళ్లు, పురుగుల నివారణకు ఆధునిక పరిజ్ఞానం
అనంతపురం అగ్రికల్చర్: ఇటీవల వ్యవసాయ, ఉద్యాన పంటల్లో తెగుళ్లు, పురుగులు, చీడపీడల ఉధృతి ఎక్కువైన నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వ్యవసాయశాఖ అనంతపురం జేడీ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. రైతులు నష్టపోకుండా ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చిన నేషనల్ పెస్ట్ సర్వేయిలేన్స్ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌ఎస్) యాప్ వినియోగంపై ఉభయ జిల్లాల వ్యవసాయ, ఉద్యాన అధికారులకు బుధవారం అనంతపురంలోని రైతు శిక్షణా కేంద్రం (ఎఫ్‌టీసీ)లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎన్‌పీఎస్‌ఎస్ ప్లాంట్ ప్రోటెక్షన్ ఆఫీసర్ వీరయ్య, ఆత్మ పీడీ ఎంసీ మద్దిలేటి, టెక్నికల్ ఏఓ వెంకట్‌కుమార్, హెచ్‌ఓ రత్నకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ... విచ్చలవిడి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల రోగ నిరోధకశక్తి పెరిగి వివిధ పంటల్లో పురుగులు, తెగుళ్లు, చీడపీడల ఉధృతి పెరుగుతోందన్నారు. కొన్ని సందర్భాల్లో అవసరం లేకున్నా రెండు మూడు రకాల మందులు కలిపి పిచికారీ చేస్తున్నందున రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయన్నారు. దీంతో ఎన్‌పీఎస్‌ఎస్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, ఈ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకుని పురుగులు, తెగుళ్ల ఉఽనికి, ఉధృతిని గుర్తించవచ్చునన్నారు. తెగుళ్లు ఆశించిన తొలిదశలోనే నివారణ, ఉధృతి పెరిగినపుడు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులను చైతన్య పరిచేందుకు ఈ యాప్ దోహదపడుతుందన్నారు. ఇటీవల ఉద్యాన పంటల్లో పండుఈగ సమస్య అధికంగా ఉందన్నారు. అలాగే మిరపలో నల్లతామర ఉధృతి పెరిగిందన్నారు. ఇలా కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు సర్వసాధారణంగా వివిధ రకాల పంటలను ఆశించి దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయన్నారు. వీటికి పరిష్కారంగా సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన ఎన్‌పీఎస్‌ఎస్ యాప్‌ను సద్వినియోగం చేసుకుని క్షేత్రస్థాయిలో రైతులకు మేలు జరిగేలా పనిచేయాలన్నారు.
ఎన్‌పీఎస్‌ఎస్ యాప్ ద్వారా సమగ్ర సస్యరక్షణ
శిక్షణా కార్యక్రమంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment