ఏపీకి ఆరోగ్య సిరి | Above 76 percent people are undergoing treatment under Aarogyasri in AP | Sakshi
Sakshi News home page

ఏపీకి ఆరోగ్య సిరి

Published Mon, Oct 5 2020 3:05 AM | Last Updated on Mon, Oct 5 2020 8:26 AM

Above 76 percent people are undergoing treatment under Aarogyasri in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆరోగ్యశ్రీది ఒక చరిత్ర. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ నేడు కోట్లాది మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడుతోంది. దేశంలోనే పలు రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిచింది. వైద్యం కోసం ప్రభుత్వమే బీమా చెల్లిస్తూ ఉచితంగా వైద్యం అందిస్తున్న పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. తరువాత స్థానంలో తెలంగాణ ఉంది. ఆరోగ్యశ్రీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించారు కాబట్టి దీన్ని రాష్ట్రం విడిపోయాక కూడా తెలంగాణలో కొనసాగిస్తున్నారు. ఈ పథకం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పేద కుటుంబాలకు వరప్రసాదిని అయిందని తాజాగా జాతీయ శాంపిల్‌ సర్వేలో తేలింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వం కల్పించే ఉచిత వైద్య బీమా పథకంలో ఇంతగా లబ్ధిపొందిన దాఖలాలు లేవని తేల్చారు.

నేషనల్‌ శాంపిల్‌ సర్వే ప్రకారం..
► దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 85.9 శాతం మందికి ఎలాంటి బీమా వర్తించడం లేదు.. పట్టణ ప్రాంతాల్లో 80.9 శాతం మందికి ఉచిత బీమా లేదు
► ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ లాంటి పథకం వల్ల భారీగా పాకెట్‌ ఎక్స్‌పెండిచర్‌ (వైద్యానికయ్యే జేబు ఖర్చు) తగ్గింది.
► దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళతో పోల్చుకుంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పేదలు ఎక్కువగా లబ్ధిపొందుతున్నారు. లబ్ధిపొందుతున్న వారిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువమంది ఉన్నారు. ప్రభుత్వాలే ఉచితంగా బీమా కల్పించి వైద్యం అందించడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా నిలబడగలిగాయి.
► చాలా రాష్ట్రాల్లో జీవనశైలి జబ్బులైన క్యాన్సర్, గుండె, నరాల జబ్బులతో కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వంటి పథకం ఉండటం వల్ల పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

ఇప్పుడు మరింతమంది లబ్ధిదారులు
జాతీయ శాంపిల్‌ సర్వే అనంతరం రాష్ట్రంలో మరిన్ని మార్పులు జరిగాయి. గతంలో తెల్లరేషన్‌ కార్డు ఉన్న వారికే ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేసేవారు. అయితే ఇప్పుడు తెల్లకార్డుతో సంబంధం లేకుండా వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారందరికీ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేశారు. జబ్బుల సంఖ్యను 1,059 నుంచి 2వేలకు పైగా పెంచారు. దీంతో ఇటీవలి కాలంలో  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల సంఖ్య మరింతగా పెరిగింది. రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలు పైగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. ఆస్పత్రిలో బిల్లు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వెసులుబాటుతో మరింతగా జేబు ఖర్చులు తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తుండటంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరగనున్నట్టు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement