సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలంటే ఇంకా 233.68 టీఎంసీలు అవసరం. గతంలో ఎన్నడూ లేని రీతిలో జూలై ప్రథమార్థంలోనే కృష్ణా ప్రధాన పాయపై ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌తోపాటు ప్రధాన ఉపనది తుంగభద్రపై ఎగువన ఉన్న తుంగ, భద్ర, తుంగభద్ర జలాశయాలు నిండాయి. ఎగువ నుంచి వచ్చిన ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. సాధారణంగా కృష్ణా నదికి ఆగస్టులో భారీ వరదలు వస్తాయి.
ఎగువన ప్రాజెక్టులన్నీ ఇప్పటికే నిండటం, ఆగస్టులో కురవనున్న వర్షాలతో గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ కృష్ణా ప్రాజెక్టులన్నీ నిండటం ఖాయమని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా, తుంగభద్రలపై ఎగువన ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో గేట్లు ఎత్తి దిగువకు వరద జలాలను విడుదల చేశారు. గతేడాది కంటే రెండు రోజులు ఆలస్యంగా ఈనెల 13న శ్రీశైలానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి.
ప్రధాన పాయపై..
ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి శ్రీశైలంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో గతేడాది కంటే ఐదు రోజుల ముందే ఈనెల 23న శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తర్వాత వరద తగ్గడంతో గేట్లు మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం ఎడమ, కుడిగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ వదులుతున్న జలాలు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. నాగార్జునసాగర్‌లో 204 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ నిండాలంటే ఇంకా 108 టీఎంసీలు అవసరం. మూసీ వరద ఉద్ధృతితో పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ ఇప్పటికే గరిష్ట స్థాయిలో 40 టీఎంసీలకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నిండటానికి మరో ఐదు టీఎంసీలు అవసరం. విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాల ద్వారా శ్రీశైలంలో ఏర్పడే ఖాళీని భర్తీ చేసేందుకు మరో 24 టీఎంసీలు అవసరం.
శ్రీశైలంపై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలంటే..
► శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తారు.
► తెలుగుగంగలో అంతర్భాగమైన వెలిగోడు సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ఇప్పటికే ప్రాజెక్టులో 8.42 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నిండాలంటే 8.53 టీఎంసీలు అవసరం. బ్రహ్మంసాగర్‌లో 17.74 టీఎంసీలకుగానూ 12.05 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 5.69 టీఎంసీలు కావాలి. సోమశిలలో 78 టీఎంసీలకుగానూ 56.46 టీఎంసీలు, కండలేరులో 68.03కిగానూ 28.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు నిండాలంటే 60.99 టీఎంసీలు అవసరం. మొత్తమ్మీద తెలుగుగంగ ప్రాజెక్టులో భాగమైన జలాశయాలు నిండాలంటే ఇంకా 75.21 టీఎంసీలు కావాలి.
► ఎస్సార్బీసీలో అంతర్భాగమైన గోరకల్లు రిజర్వాయర్‌లో 12.44కిగానూ 3.7, అవుకు రిజర్వాయర్‌లో 4.15కిగానూ 2.18 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు నిండాలంటే ఇంకా 10.71 టీఎంసీలు అవసరం.
► గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన గండికోటలో 26.85కిగానూ 22.04, సర్వారాయసాగర్‌లో 3.06కిగానూ 0.54, పైడిపాలెంలో 6కిగానూ 4.69, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10కిగానూ 7.88 వెరసి ఈ ప్రాజెక్టులన్నీ నిండటానికి 10.76 టీఎంసీలు అవసరం.
► శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌పై ఆధారపడ్డ ఈ జలాశయాలన్నీ నిండాలంటే ఇంకా 96.68 టీఎంసీలు అవసరం.
► హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 40 టీఎంసీలను తరలించాల్సి ఉంటుంది. కృష్ణాలో వరద ప్రవాహం అక్టోబర్ వరకూ కొనసాగే అవకాశాలు ఉండటంతో నీటి లభ్యత ఆ మేరకు పెరగనుంది.
ఖరీఫ్ పంటలకు ముందుగానే నీరు
ఏటా అక్టోబర్ చివరిలో, నవంబర్‌లో వచ్చే తుపాన్‌ల బారి నుంచి ఖరీఫ్ పంటలను కాపాడేందుకు ఈ ఏడాది ప్రభుత్వం ముందుగానే ఆయకట్టుకు నీటిని విడుదల చేసింది. తుపాన్‌లు వచ్చేలోగా పంట నూర్పిళ్లు పూర్తై దిగుబడులను భద్రంగా ఇంటికి చేర్చడం ద్వారా అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నీటి లభ్యత ఆధారంగా రబీ, మూడో పంట సాగుకు కూడా అవకాశం కల్పించడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. పాలకుడి సమున్నత లక్ష్యానికి తగ్గట్టుగానే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటం.. నీటి లభ్యత పుష్కలంగా ఉండే అవకాశం ఉండటం.. ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం ముందుగానే నీటిని విడుదల చేయడం పట్ల రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment