
సాక్షి, విజయవాడ: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్స్, పోస్టర్లు, కటౌట్లను ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల్లోపు తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుపర్చడానికి అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరచడం, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టంను విస్తృత స్థాయిలో వినియోగించడం, సీ విజిల్ ద్వారా అందే ఫిర్యాదుల సకాలంలో పరిష్కరించడం తదితర అంశాలను ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పాల్గొన్నారు.