సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు విఘాతం కలిగించకుండా పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ–ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ షేరింగ్ డిస్‌ప్యూట్స్) చట్టం–1956లో సెక్షన్–1 ప్రకారం కొనసాగుతున్న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2కు మరిన్ని విధి విధానాల జారీకి బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ ప్రభుత్వం 2014 జూలై 14న చేసిన ఫిర్యాదు ప్రకారం ఈ విధి విధానాలను కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేశారని గుర్తు చేశారు. ఆ విధి విధానాల నుంచి కృష్ణా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లోని మిగతా రెండు రాష్ట్రాలను (మహారాష్ట్ర, కర్ణాటక) పూర్తిగా మినహాయించి.. రెండు రాష్ట్రాలకే (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) పరిమితం చేయాలని ఏకపక్షంగా సూచించడం అశాస్త్రీయం అని చెప్పారు. దీంతోపాటు జాతీయ సంపద అయిన జల వనరులను న్యాయ బద్ధంగా వినియోగించుకోవడానికి కూడా విరుద్ధమని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కృష్ణా జలాలపై ఆధార పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ పరమైన చిక్కులను పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకోకుండా కేంద్ర జల్ శక్తి శాఖను ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానికి లేఖ రాశారు. అందులో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.
కేడబ్ల్యూడీటీ–1 అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం
– ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–4 ప్రకారం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–1 (కేడబ్ల్యూడీటీ – కృష్ణా వాటర్ డిస్‌పూట్ ట్రిబ్యునల్)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేడబ్ల్యూడీటీ–1 ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా 1976 మే 31న గెజిట్‌ను ప్రచురించింది. కృష్ణా నదిలో 2,130 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయని కేడబ్ల్యూడీటీ–1 లెక్క కట్టింది.
– 75 శాతం లభ్యత ఆధారంగా ఆ మేరకు నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసింది. దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించింది. 2,130 టీఎంసీల కన్నా అధికంగా ఉన్న జలాలు అంటే మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–6(1) ప్రకారం కేడబ్ల్యూడీటీ–1 అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం.
అదనపు ప్రవాహాన్ని వినియోగించుకునే స్వేచ్ఛ
– అనంతరం కృష్ణా జలాల పంపిణీకి ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ చట్టం –1956లోని సెక్షన్–4 (1) ప్రకారం 2004 ఏప్రిల్ 2న కేడబ్ల్యూడీటీ–2 (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న సెక్షన్–5(2) ప్రకారం నివేదిక సమర్పించింది. ఆ తర్వాత 2013 నవంబర్ 29న సెక్షన్ 5(3) ప్రకారం కేడబ్ల్యూడీటీ–1 ద్వారా అప్పటికే 75 శాతం లభ్యత ఆధారంగా చేసిన 2,130 టీఎంసీల కేటాయింపులను నిర్ధారిస్తూ కేడబ్ల్యూడీటీ–2 తదుపరి నివేదిక సమర్పించింది.
– బేసిన్‌లోని రాష్ట్రాలకు సగటు ప్రవాహాలతో సహా 65 శాతం లభ్యత ఆధారంగా అదనపు నీటిని కూడా కేటాయించింది. దీని కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 194 టీఎంసీలు కేటాయించింది. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన మొత్తం కేటాయింపులు 1005 టీఎంసీలు (811 టీఎంసీలు+194 టీఎంసీలు). దీంతోపాటు 2,578 టీఎంసీల కంటే ఎక్కువగా ఉండే అదనపు ప్రవాహాలను ఉపయోగించుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు స్వేచ్ఛ ఇచ్చింది.
సుప్రీంకోర్టులో ఐదు ఎస్సెల్పీలు
– కేడబ్ల్యూడీటీ–2 నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఐదు ఎస్సెల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్)లను కృష్ణా బేసిన్‌లోని రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేశాయి. సెక్షన్ 5(2) ప్రకారం కేడబ్ల్యూడీటీ–2 ఇచ్చిన నివేదికను పక్కన పెట్టాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. సుప్రీంకోర్టు 2011 సెప్టెంబరు 16న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా కేడబ్ల్యూడీటీ–2 సెక్షన్–5(2) కింద ఇచ్చిన నివేదికపై స్టే ఇచ్చింది.
అన్ని ఎస్సెల్సీలు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఇదే అంశాన్ని 2021 ఆగస్టు 17న.. ఆ తర్వాత 2022 జూన్ 25న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ట్రిబ్యునల్ ద్వారా జరిగిన కేటాయింపులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా న్యాయ బద్ధమైన నిర్ణయం తీసుకోవాలని కోరాం.
Comments
Please login to add a commentAdd a comment