సాక్షి, అమరావతి: రబీలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఖరీఫ్‌లో మాదిరిగానే ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు రైతుల నుంచి నూరుశాతం ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వింటాలు ధాన్యం గ్రేడ్ ‘ఏ‘ రకాన్ని రూ.1,960కి, సాధారణ రకాన్ని రూ.1,940కి కొనుగోలు చేస్తోంది. రబీలో రాష్ట్రవ్యాప్తంగా 21.57 లక్షల ఎకరాల్లో వరి సాగవగా 62.57 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.
చదవండి: ఏపీలో తొలి ఎయిర్ బెలూన్ థియేటర్.. ఎక్కడో తెలుసా?
గతేడాది రబీలో 2.90 లక్షలమంది రైతుల నుంచి రూ.6,628 కోట్లు విలువైన 35.40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు సుమారు రూ.7 వేలకోట్లకుపైగా విలువైన 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. దాన్ని కస్టమ్ మిల్లింగ్ చేస్తే 24.79 లక్షల టన్నుల బియ్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు గడిచిన ఖరీఫ్‌లో రూ.7,904.34 కోట్ల విలువైన 40.61 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా.. 5,83,803 మంది రైతులు మద్దతు ధర పొందారు.
ఇప్పటికే రూ.205.28 కోట్ల ధాన్యం కొనుగోలు
మార్చితో ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తవడంతో.. వెంటనే ఆర్బీకేల్లో ఈనెల నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటివరకు 5,306 మంది రైతుల నుంచి రూ.205.28 కోట్ల విలువైన 1,04,800 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 6,884 ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఈ ధాన్యం సేకరణకు అవసరమైన గోనెసంచులు, హమాలీలు, రవాణా వాహనాలను ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా సమకూరుస్తోంది. ఈ–క్రాప్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న రైతులందరి నుంచి (కౌలు రైతులతో సహా) కళ్లాల నుంచే ధాన్యం కొనుగోలు చేయనుంది. కేంద్రం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధాన్యంలో తేమ/నిమ్ము 17 శాతానికి మించకుండా ఉండేలా చూడాలి.
దళారుల దోపిడీకి అడ్డుకట్ట
తొలిసారి వికేంద్రీకృత విధానంలో ఖరీఫ్‌లో ధాన్యం సేకరించిన ప్రభుత్వం చాలావరకు దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. గత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ–క్రాప్‌తో పాటు రైతుల ఈ–కేవైసీ (వేలిముద్రలు) సేకరణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపడుతోంది. గడువులోగా ఆధార్ ఆధారిత చెల్లింపులను వేగవంతంగా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
ప్రతి రైతుకి మద్దతు ధర
రాష్ట్రంలో వరి సాగుచేసిన ప్రతి రైతుకి మద్దతు ధర కల్పించి పంటను కొనుగోలు చేస్తాం. ఈ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో చేపడతాం. ఎక్కడైనా రైతులకు సమస్యలుంటే వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. మిల్లర్లతో కూడా మాట్లాడి వేగంగా ధాన్యం సేకరణ జరిగేలా చర్యలు చేపడతాం. ఎప్పటికప్పుడు అధికారులు ధాన్యం సేకరణ కేంద్రాలను తనిఖీ చేస్తూ లోపాలను వెంటనే సరిదిద్దుతారు.
-కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌరసరఫరాలశాఖ మంత్రి
పకడ్బందీగా కొనుగోళ్లు
రబీ ధాన్యం సేకరణకు 26 జిల్లాల్లోను ఏర్పాట్లు చేశాం. ఈనెల 5వ తేదీ నుంచి కొనుగోళ్లు జరుగుతున్నాయి. గతంలో చేపట్టినట్టే ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని క్షేత్రస్థాయిలోనే కొంటున్నాం. ఈ–కేవైసీ, ఈ–క్రాప్ నమోదులో సమస్యలు తలెత్తకుండా వ్యవసాయశాఖ అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నాం. నగదు జమచేసే సమయంలో సాంకేతిక సమస్యలు రాకుండా చర్యలు చేపడుతున్నాం.
–వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాలసంస్థ
Comments
Please login to add a commentAdd a comment