సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ క్లాస్–2 సభ్యుల నియామకాలను గతంలో ఎన్నడూ లేనంత పారదర్శకంగా చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ నియామకాలకు సంబంధించి విశ్వవిద్యాలయాల చట్టంలో నిర్దిష్ట నిబంధనలు లేకున్నా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ పారదర్శకంగా చేపట్టామని తెలిపింది. గత మూడు దశాబ్దాల్లో వీటిపై ఎలాంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కాలేదని పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల నియామకాల ఫైలు చాలా రహస్యంగా ఉంటుందని, పిటిషనర్ నిమ్మీ గ్రేస్ మోసపూరిత పద్ధతుల ద్వారా సేకరించిన ఈ సమాచారాన్ని ఆమె తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ మీడియాకు లీక్ చేశారని ప్రభుత్వం తెలిపింది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు శ్రవణ్‌కుమార్‌పై ఈ ఏడాది మేలో కేసు కూడా నమోదు చేశారని వివరించింది.
పిటిషనర్ ఈ వ్యాజ్యం దాఖలు చేయడం వెనుక దురుద్దేశాలున్నాయని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించింది. విశాఖకు చెందిన ముందడుగు ప్రజాపార్టీ నాయకురాలు నక్కా నిమ్మీగ్రేస్ తరఫున న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ (ముందడుగు ప్రజా పార్టీ అధ్యక్షుడు) దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీ‹Ùచంద్ర కౌంటర్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు శ్రవణ్‌కుమార్ గడువు కోరడంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో ముఖ్యాంశాలు ఇవీ....
రాజకీయ సిఫారసులు అవాస్తవం..
విశ్వవిద్యాలయాల్లో కార్యనిర్వాహక, విద్యా సంబంధిత కార్యకలాపాల నిర్వహణకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకడమిక్ సెనెట్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో క్లాస్–1, క్లాస్–2 సభ్యులుంటారు. ఈ సభ్యులను నియమించే అధికారం ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీదే. క్లాస్–2 సభ్యులను నిర్దిష్ట విధానంలోనే నియమించాలన్న నిబంధనలు లేవు. క్లాస్–2 నియామకాలు ‘నామినేట్’ కిందకే వస్తాయి కానీ ‘అపాయింట్‌మెంట్’ కిందకు రావు. వీటిని రాజకీయ సిఫారసుల ఆధారంగా చేపట్టారన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదు. దరఖాస్తులను పరిశీలించి పలు రకాలుగా వడపోత అనంతరం తుది జాబితా రూపొందించాం. క్లాస్–2 సభ్యుల నియామకానికి 541 దరఖాస్తులు రాగా 389 పేర్లను ఖరారు చేశాం. సిఫారసుల ప్రకారం వచ్చిన 201 బయోడేటాల్లో 57 మంది పేర్లనే నామినేట్ చేశాం. వీరిలో 36 మంది పూర్తిగా ప్రతిభ, సమర్థత ఆధారంగా నామినేట్ అయ్యారు.
నియామకాల్లో మహిళలకు 50 శాతం..
స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిఫారసులను ప్రభుత్వం సవరించి క్లాస్–2 సభ్యుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం, మహిళలకు 50 శాతం స్థానం కల్పించింది. గతంలో ఏ ప్రభుత్వం ఇలా చర్యలు తీసుకోలేదు. 2016లో క్లాస్–2 సభ్యులను ముఖ్యమంత్రి కార్యాలయం నోట్ ఆధారంగా నామినేట్ చేశారు. 14 విశ్వవిద్యాలయాల్లో 116 మంది క్లాస్–2 సభ్యుల నియామకాన్ని 2019లో చేపట్టి ఆర్నెల్ల సుదీర్ఘ ప్రక్రియ తరువాత పూర్తి పారదర్శకంగా, సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ పూర్తి చేశాం. రహస్యంగా ఉండే నియామకాల ఫైళ్లను పిటిషనర్ తప్పుడు, మోసపూరిత మార్గంలో సేకరించి దురుద్దేశంతో మీడియాకు లీక్ చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని న్యాయస్థానాన్ని అభ్యరి్థస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment